Bumper Offer : మందుబాబులకు థాయిలాండ్ ట్రిప్ ఆఫర్ చేసిన వైన్ షాప్ యజమాని
Bumper Offer : కాకినాడ జిల్లాలో ఓ మద్యం దుకాణం యజమాని కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నమైన ఆఫర్ ప్రకటించాడు
- By Sudheer Published Date - 06:25 PM, Tue - 4 February 25

వ్యాపారాన్ని (Business ) విస్తరించేందుకు వ్యాపారస్తులు ఎన్నో కొత్త కొత్త ఆఫర్లు (Offers) ప్రకటిస్తుంటారు. పండగల సందర్భంగా భారీ డిస్కౌంట్లు, లక్కీ డ్రాలు అందించడం కొత్తేమీ కాదు. కానీ కాకినాడ జిల్లాలో ఓ మద్యం దుకాణం యజమాని కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నమైన ఆఫర్ ప్రకటించాడు. మందు కొన్నవారికి లాటరీ టికెట్లు ఇచ్చి, విజేతలకు థాయిలాండ్ ట్రిప్ అందిస్తానంటూ షాపు ముందు పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు.
కాకినాడకు చెందిన “వినాయక వైన్స్” (Vinayaka Wines) మద్యం షాపు యజమాని తన కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్ తీసుకొచ్చాడు. లిక్కర్ కొనుగోలు చేసిన ప్రతిసారి టోకెన్లు ఇస్తామని, తరువాత లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తామని ప్రకటించాడు. లక్కీ డ్రాలో విజేతలకు బైకులు, మొబైల్ ఫోన్లు, రూ.1.5 లక్షల విలువైన బహుమతులు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా గ్రాండ్ ప్రైజ్‌గా థాయిలాండ్ ట్రిప్ (Thailand Trip) ఆఫర్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మందుబాబుల్లో ఉత్సాహం పెరిగింది. తక్కువ ఖర్చుతో లాటరీ టికెట్ సంపాదించి, అదృష్టం బాగుంటే విదేశీ టూర్కు వెళ్ళొచ్చని భావించి, ఈ మద్యం షాపుకు భారీగా క్యూ కడుతున్నారు. తమ ఖర్చు చేసుకున్న మద్యం డబ్బుకు అదనంగా బహుమతి గెలుచుకునే అవకాశమున్నందున అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మద్యం విక్రయాన్ని ప్రోత్సహించడానికి ఇలాంటి ఆఫర్లు ఉపయోగించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. మద్యం వ్యసనాన్ని పెంచేలా ఇలాంటి ఆఫర్లు ఉండకూడదని, ఇది నైతికంగా తప్పని అభిప్రాయపడుతున్నారు.