Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!
గత నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో జరిగిన వంశీ గాదిరాజు - నేత్రల వివాహం భారతీయ వివాహ వేడుకల్లోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రధాన ఆకర్షణ అక్కడ ఏర్పాటు చేసిన భారీ వెడ్డింగ్ కేక్
- Author : Sudheer
Date : 21-04-2026 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన ఒక రాయల్ వెడ్డింగ్‌లో ప్రదర్శించిన వెడ్డింగ్ కేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.గత నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో జరిగిన వంశీ గాదిరాజు – నేత్రల వివాహం భారతీయ వివాహ వేడుకల్లోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రధాన ఆకర్షణ అక్కడ ఏర్పాటు చేసిన భారీ వెడ్డింగ్ కేక్. ఇది కేవలం ఒక మిఠాయి మాత్రమే కాదు, ఫ్రెంచ్ పేస్ట్రీ చెఫ్ బాస్టియన్ రూపొందించిన ఒక అద్భుత కళాఖండం. రాజస్థానీ వాస్తుశిల్ప కళా రీతులను పుణికిపుచ్చుకున్న ఈ కేక్, వెడ్డింగ్ హాల్‌లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అతిథులందరినీ మంత్రముగ్ధులను చేసింది.
3,500 గంటల శ్రమ – కోట్లలో ఖర్చు
ఈ కేక్ తయారీ వెనుక ఉన్న గణాంకాలు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ ఒక్క కేక్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి సుమారు 3,500 గంటల సమయం పట్టిందట. అంటే దాదాపు ఐదు నెలల పాటు నిరంతరం శ్రమిస్తే తప్ప ఈ రూపం రాలేదు. దీని డిజైనింగ్ మరియు తయారీ కోసం సదరు చెఫ్‌కు దాదాపు $2 మిలియన్లు (సుమారు రూ. 16 కోట్లకు పైగా) చెల్లించినట్లు సమాచారం. ఇంత భారీ ఖర్చుతో కూడిన కేక్ బహుశా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేక్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది.
రాజస్థానీ డీటెయిలింగ్‌తో అద్భుత రూపం
ఈ కేక్ ఇంత ప్రత్యేకంగా నిలవడానికి కారణం అందులోని సూక్ష్మమైన డీటెయిలింగ్. రాజస్థాన్ కోటల్లో కనిపించే అందమైన తోరణాలు, గంభీరమైన ఏనుగులు, మరియు నాట్యం చేస్తున్న నెమళ్ల ఆకృతులను కేక్‌పై అత్యంత కళాత్మకంగా చెక్కారు. ప్రతి అంగుళంలోనూ రాజస్థానీ వారసత్వం ప్రతిబింబించేలా చెఫ్ బాస్టియన్ దీన్ని మలిచారు. ప్యాలెస్ తరహాలో నిర్మించిన ఈ కేక్ స్ట్రక్చర్, ఆహార పదార్థం కంటే కూడా ఒక అపురూప శిల్పంలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.