Fact Check : టైట్ అండర్‌వేర్ ధరిస్తే.. పురుషుల్లో వీర్యకణాలు తగ్గిపోతాయా ?
బిగుతుగా ఉండే లోదుస్తులను ధరిస్తే రిలీజయ్యే వేడి వల్ల వంధ్యత్వం(Fact Check) కలుగుతుందా ? అనేది పెద్ద ప్రశ్న.
- By Pasha Published Date - 05:03 PM, Mon - 16 December 24

Fact Checked By firstcheck
వాదన : బిగుతుగా ఉండే లోదుస్తులు (అండర్ వేర్స్) ధరిస్తే పురుషుల్లో వీర్యకణాల (స్పెర్మ్) కౌంట్ తగ్గిపోతుంది.
వాస్తవం: బిగుతైన అండర్ వేర్స్ ధరిస్తే స్పెర్మ్ కౌంట్ తగ్గడం అనేది నిజమే. అయితే దాని వల్ల వంధ్యత్వం కలుగుతుందనే వాదనకు ఆధారాలు లేవు.
వాదనలో ఏముంది ?
సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో హ్యాండిల్ @Men_Sex_Health ద్వారా ఒక పోస్ట్ పబ్లిష్ అయింది. బిగుతుగా ఉండే అండర్ వేర్స్‌ను ధరించొద్దని ఆ పోస్ట్‌లో పురుషులను హెచ్చరిస్తున్నారు. అలాంటి లోదుస్తుల వల్ల స్పెర్మ్ కౌంట్ దాదాపు 40 శాతం దాకా తగ్గిపోతుందని అందులో ప్రస్తావించారు. ‘‘బిగుతైన లోదుస్తులు ధరించడం మానేయండి. అలాంటి అండర్ వేర్స్ ధరిస్తే ఆ భాగంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అక్కడ ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సీయస్ మేర పెరిగితే స్పెర్మ్ కౌంట్ అనేది 40 శాతం దాకా తగ్గిపోతుంది’’ అని ఆ పోస్ట్‌లో ఉంది. అయితే ఈ వాదనను బలపరిచే శాస్త్రీయ ఆధారాలను ఎక్స్ పోస్ట్‌కు జోడించలేదు. మొత్తం మీద దీనికి 52.4K వ్యూస్, 893 లైక్‌లు వచ్చాయి.
Stop wearing tight underwear:
Wearing underwear increases the temperature down there.
Increasing the temperature by one degree Celsius reduces sperm concentration by 40%.
— Men’s Sexual Health (@Men_Sex_Health) October 18, 2023
వాస్తవిక వివరాలివీ..
- ‘సైన్స్ డైరెక్ట్’లో పబ్లిష్ అయిన అధ్యయన నివేదిక ప్రకారం.. అండర్ వేర్ ధరించే భాగంలో సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు వీర్యకణాల (స్పెర్మ్‌ల) ఉత్పత్తి ఎక్కువ ప్రభావవంతంగా జరుగుతుంది. అందుకే చాలా క్షీరదాలలో వృషణాలు శరీరం వెలుపల ఉంటాయని సదరు నివేదికలో ప్రస్తావించారు. పలు క్షీరదాలలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించాల్సిన అవసరం వచ్చినప్పుడు.. వృషణాలను నిర్వహించే క్రీమాస్టర్ అనే కండరం పట్టును సడలిస్తుంది. ఫలితంగా వృషణాలు చల్లబడుతాయి. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించినప్పుడు మన వృషణాలు శరీరానికి బాగా దగ్గరగా ఉంటాయి. ఫలితంగా వాటి వేడి పెరుగుతుంది. వృషణాలలో సగటున 0.5 డిగ్రీల సెల్సీయస్ నుంచి 0.8 డిగ్రీల సెల్సీయస్ మేరకు టెంపరేచర్ పెరుగుతుంది. అయితే ఈ టెంపరేచర్ పెరగడం వల్ల వీర్యకణాలు దెబ్బతినడం, వంధ్యత్వం రావడం లాంటి సమస్యలు వస్తాయి అనే దానికి ధ్రువీకరణ ఏదీ లేదు.
- ‘‘బిగుతుగా ఉండే లోదుస్తులను ధరిస్తే రిలీజయ్యే వేడి వల్ల వంధ్యత్వం(Fact Check) కలుగుతుందా ? అనేది పెద్ద ప్రశ్న. వాస్తవానికి ఇప్పటివరకు ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు’’ అని పేర్కొంటూ కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీ వెబ్‌సైటు(Mcgill.ca)లో ఒక నివేదికను ప్రచురించారు. జీవనశైలి, పర్యావరణ కారకాలు, మానసిక ఒత్తిడి అనేవి పురుషుడి స్పెర్మ్ కౌంట్‌పై, అతని సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు కనుగొన్నాయని ఈ నివేదికలో పొందుపరిచారు. ‘‘పురుషుడు ధరించే దుస్తులు కూడా సంతానోత్పత్తి సామర్థ్యంపై కొంత ప్రభావం చూపొచ్చు. అంటే బిగుతుగా ఉండే అండర్ వేర్స్, ప్యాంట్లు వీర్య కణాల నాణ్యతను తగ్గించే ఛాన్స్ ఉంటుంది’’ ఈ అధ్యయన నివేదిక తెలిపింది.
ఏం తేలింది ?
బిగుతైన లోదుస్తులు ధరిస్తే వృషణాల టెంపరేచర్ పెరుగుతుందన్న విషయం కరెక్టే. ఈ మార్పు వల్ల స్పెర్మ్ నాణ్యత, ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పరిణామం వల్ల వంధ్యత్వం కలుగుతుంది అని కచ్చితంగా చెప్పే శాస్త్రీయ ఆధారాలు అందుబాటులో లేవు.