ఎలాంటి పరిస్థితుల్లో ఆ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దు – పోలీస్ వార్నింగ్
అన్నోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడిన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి బ్లాక్మెయిల్ కు గురై రూ. 3.41 లక్షలు పోగొట్టుకున్నాడు.
- Author : Sudheer
Date : 20-12-2025 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
- సరికొత్త పద్ధతుల్లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
- వీడియో కాల్స్ చేసి అమాయకులను బెదిరిస్తున్నారు
- సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో అమాయకులను వల వేసి దోచుకుంటున్నారు. ఇటీవల కాలంలో ‘సెక్స్టార్షన్’ (Sextortion) పేరుతో జరుగుతున్న మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి గుర్తుతెలియని నంబర్ నుండి వచ్చిన వీడియో కాల్‌ను లిఫ్ట్ చేసి, భారీగా మూల్యం చెల్లించుకున్నాడు. ఒక గుర్తుతెలియని మహిళ అతడికి వీడియో కాల్ చేసి, మాటలతో లోబరుచుకుని అసభ్యకరంగా ప్రవర్తించేలా ప్రేరేపించింది. బాధితుడికి తెలియకుండానే ఆ దృశ్యాలను రికార్డ్ చేసిన నేరగాళ్లు, ఆ తర్వాత తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు.

Fake Video Call
వీడియో కాల్ ముగిసిన కొద్దిసేపటికే, మరో వ్యక్తి రంగంలోకి దిగి బాధితుడిని బెదిరించడం ప్రారంభించాడు. రికార్డ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బ్లాక్మెయిల్ చేశాడు. అవమాన భయంతో బాధితుడు నిందితుడు అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తూ వచ్చాడు. ఇలా పలు విడతలుగా దాదాపు రూ. 3.41 లక్షలను సదరు వ్యక్తి పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా బాధితుడి బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేయడం, మరిన్ని డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక చివరకు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ తరహా సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్, ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో అపరిచిత నంబర్ల (Unknown Numbers) నుంచి వచ్చే వీడియో కాల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఇటువంటి ట్రాప్‌లో చిక్కుకుంటే, భయపడి డబ్బులు పంపకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులతో డిజిటల్ సంభాషణలు జరిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం ఒక్కటే ఈ ముప్పు నుంచి తప్పించుకునే మార్గం.