Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు ఏ సమయానికి బంగారం కొనుగోలు చేయాలంటే..!!
Akshaya Tritiya : అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి శుభ కార్యం ఎప్పటికీ చెడదని, శాశ్వత ఫలితాలను అందిస్తుందని నమ్మకం ఉంది
- By Sudheer Published Date - 11:57 AM, Tue - 29 April 25

అక్షయ తృతీయ(Akshaya Tritiya)ను భారతీయులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ 30 బుధవారం నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకోనున్నారు. హిందూ పంచాంగం ప్రకారం.. వైశాఖ శుక్ల పక్ష తృతీయ నాడు ఈ పండుగ వస్తుంది. అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి శుభ కార్యం ఎప్పటికీ చెడదని, శాశ్వత ఫలితాలను అందిస్తుందని నమ్మకం ఉంది. ఈ రోజు బంగారం కొనడం విశేష శుభప్రదంగా భావించి, చాలామంది కొత్త బంగారు (Gold) ఆభరణాలు, నాణేలు కొనుగోలు చేస్తారు. ప్రత్యేకించి ఈ ఏడాది రోహిణి నక్షత్రం, బుధవారం కలసి రావడం వల్ల ఈ రోజు మరింత పవిత్రంగా పరిగణిస్తున్నారు.
Vanshika Saini : కెనడాలో ఆప్ నేత కుమార్తె దారుణ హత్య
2025లో అక్షయ తృతీయ పూజా ముహూర్తం ఏప్రిల్ 30న ఉదయం 5:41 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు ఉంది. తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:31కి ప్రారంభమై, ఏప్రిల్ 30 మధ్యాహ్నం 2:12కి ముగుస్తుంది. బంగారం కొనుగోలుకు శుభ ముహూర్తాలు రెండు రోజులూ ఉన్నాయి. ఏప్రిల్ 29న సాయంత్రం 5:31 నుంచి ఏప్రిల్ 30 ఉదయం 5:41 వరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఏప్రిల్ 30న ఉదయం 5:41 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు కూడా బంగారం కొనుగోలు చేయడం శుభదాయకం. ఉదయం 5:41 నుంచి 9:00 గంటల వరకు ‘లాభ’ మరియు ‘అమృత’ ముహూర్తాలు ఉండడం విశేషం.
అక్షయ తృతీయ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోజున చేపట్టిన ఆస్తి కొనుగోలు, బంగారం పెట్టుబడి, కొత్త వ్యాపార ప్రారంభాలు శాశ్వత శ్రేయస్సును అందిస్తాయని నమ్ముతారు. బంగారం కొనడం సంపద, సిరిసంపదల చిహ్నంగా భావించబడుతుంది. ఆర్థిక నిపుణులు కూడా ఈ రోజున బంగారాన్ని ఆభరణాలు, నాణేలు, డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్స్ రూపంలో పెట్టుబడి చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దాతృత్వం, పూజలు, సంపదదేవతలైన లక్ష్మీదేవి, కుబేరుని ఆరాధన ద్వారా జీవితంలో శ్రేయస్సు, అదృష్టం కైవసం చేసుకోవచ్చు అనే నమ్మకంతో ప్రజలు ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.