US student visa : అమెరికా విద్యార్థి వీసాల జారీ తగ్గుదల..ఎందుకో తెలుసా?
ఇది కేవలం గతేడాది సంఖ్యతో పోలిస్తే కాకుండా, కోవిడ్ సమయంలో నమోదైన గణాంకాల కంటే కూడా తక్కువగా ఉండటం విశేషం. సాధారణంగా ఆగస్ట్/సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే సెమిస్టర్‌లను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థి వీసాల కోసం మార్చి నుంచి జులై మధ్య సీజన్ అత్యంత కీలకంగా ఉంటుంది.
- By Latha Suma Published Date - 11:00 AM, Wed - 9 July 25

US student visa : ఈసారి అమెరికా విద్యార్థి వీసాల సీజన్ ప్రారంభంలో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా డేటా వెల్లడిస్తోంది. గత సంవత్సరపు మార్చి నుంచి మే మధ్యకాల సీజన్‌తో పోలిస్తే, ఈ ఏడాది 27 శాతం తక్కువ ఎఫ్-1 విద్యార్థి వీసాలు మాత్రమే జారీయ్యాయి. ఇది కేవలం గతేడాది సంఖ్యతో పోలిస్తే కాకుండా, కోవిడ్ సమయంలో నమోదైన గణాంకాల కంటే కూడా తక్కువగా ఉండటం విశేషం. సాధారణంగా ఆగస్ట్/సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే సెమిస్టర్‌లను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థి వీసాల కోసం మార్చి నుంచి జులై మధ్య సీజన్ అత్యంత కీలకంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది మార్చి-మే మధ్యకాలంలో భారతీయ విద్యార్థులకు కేవలం 9,906 ఎఫ్-1 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. ఇదే సీజన్‌లో 2022లో 10,894 వీసాలు, 2023లో 14,987, 2024లో 13,478 వీసాలు జారీ కావడం గమనార్హం.
చైనాను దాటిన భారతీయులు..కానీ తగ్గుతున్న దరఖాస్తులు
అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయుల సంఖ్య ప్రథమస్థానంలో ఉంది. గతంలో చైనీయులు ఈ స్థానంలో ఉండగా, తాజాగా ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం భారతీయులే పైచేయి సాధించారు. అయినప్పటికీ, ఈ ఏడాది వీసాల దరఖాస్తుల పరంగా స్పష్టమైన మందగమనం కనిపిస్తుంది.
వీసాల తగ్గుదలకున్న కారణాలు
. ఈ తగ్గుదల వెనుక పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
. ట్రంప్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అంతర్జాతీయ విద్యార్థులపై నిఘా చర్యలు తిరిగి ఊపందుకోవడం.
. అమెరికాలో విద్యాసంస్థల్లో పాలస్తీనా మద్దతు ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై చర్యలు తీసుకోవడం.
. కొన్ని భారతీయ విద్యార్థుల వీసాల రద్దు కూడా జరగడం.
. మే 27 నుంచి జూన్ 18 వరకు అమెరికా దౌత్య కార్యాలయాలు “సోషల్ మీడియా వెట్టింగ్” ప్రక్రియ కారణంగా వీసా దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేయడం.
ఈ అంశాలు విద్యార్థుల్లో భయం, అయోమయం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వీసా ప్రక్రియలో జాప్యం లేదా రిజెక్షన్ భయంతో కొంతమంది దరఖాస్తుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. వీసా ప్రక్రియ మా జాతీయ భద్రతకు, ప్రజల రక్షణకు కీలకం. దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా అప్లై చేయాలి. మా ఓవర్సీస్ పోస్టులు నాన్ ఇమిగ్రెంట్ వీసాల షెడ్యూలింగ్ ప్రారంభించాయి. అభ్యర్థులు తమకు సరిపోయే సమయానికి అపాయింట్‌మెంట్ వెబ్‌సైట్‌లో చూసుకోవాలి. వీసా దరఖాస్తుదారుల వెట్టింగ్ పూర్తిగా నెరవేర్చడంపైనే మేం పని చేస్తున్నాం. అమెరికాకు రానున్న వారి నుంచి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.
ఇకపై పరిస్థితి ఎలా ఉంటుందో?
ముందు ముందు వీసా ప్రక్రియ సాఫీగా జరిగితే దరఖాస్తుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల ప్రభావం విద్యార్థుల నిర్ణయాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలో విద్యాభ్యాసం కోసం బయలుదేరే యువత ఇప్పుడు మరింతగా ఆలోచించి, ఆందోళనతో ముందుకెళ్తున్న పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.