Ukraine 200 Bodies: ఉక్రెయిన్ లో దారుణ దృశ్యాలు..అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో 200 మృతదేహాలు!
ఉక్రెయిన్ పై...రష్యా దాడులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎంతో అమాయకులను పొట్టనబెట్టుకున్న రష్యాసైన్యం ఆ దారుణాలోకి రాకుండా ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటోంది.
- By Hashtag U Published Date - 11:24 AM, Wed - 25 May 22

ఉక్రెయిన్ పై…రష్యా దాడులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎంతో అమాయకులను పొట్టనబెట్టుకున్న రష్యాసైన్యం ఆ దారుణాలోకి రాకుండా ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న నిజం బయటపడుతూనే ఉంది. తాజాగా బయటపడి ఓ నిజం ఇప్పుడు ప్రపంచాన్నే నిర్ఘాంతపోయేలా చేస్తోంది. భీకర పోరాటం తర్వాత ఈ మధ్యే మేరియుపోల్ ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడ ఒడిగట్టిన దారుణ మారణ కాండ వెలుగు చూసింది.
రష్యా దాడిలో ధ్వంసమైన మేరియుపోల్లో శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో…ఓఅపార్ట్ మెంట్ నుంచి దుర్వాసన వెదజల్లింది. లోపలికి వెళ్లిచూసిన అధికారులు అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. దాదాపు 200వరకు శవాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. రష్యా దాడుల్లో నగరంలో దాదాపు 12వేల మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. సంచార దహనవాటికలతోపాటు సామూహిక పూడ్చివేతలు చేపడుతూ ఈ దారుణాలు వెలుగులోకి రాకుండా రష్యా జాగ్రత్తలు తీసుకుంటుందని ఉక్రెయిన్ ఆరోపించింది.
కాగా ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సీవియెరోదోనెట్స్క్ , దాని చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టిన రష్యా దళాలు వాటిని దిగ్భంధం చేసేందుకు పెద్దెత్తున బలగాలను మోహరించాయి. స్విట్లోడార్క్స్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని తమ జెండా ఎగురవేశాయి. ఇక యుద్దం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్ పైకి రష్యా 1,474 సార్లు క్షిపణులు ప్రయోగించిదని…ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కి ఆరోపించారు.