TTD : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. శ్రీవాణి టికెట్లు పెంపు
శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రెట్టింపు చేశారు. ఎయిర్‌పోర్టులో దర్శన టికెట్ల సంఖ్యను 100 నుంచి 200 కు పెంచారు. విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
- By Latha Suma Published Date - 03:15 PM, Thu - 21 November 24

Tirumala Arjita Seva Tickets Released : ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను గురువారం అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచారు. వాటితో పాటు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి ఫిబ్రవరి కోటాను కూడా విడుదల చేశారు. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
ఇక విమాన మార్గంలో వచ్చే భక్తులకు జారీ చేసే శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రెట్టింపు చేశారు. ఎయిర్‌పోర్టులో దర్శన టికెట్ల సంఖ్యను 100 నుంచి 200 కు పెంచారు. విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్ పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్‌లో ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తోన్న టికెట్ల సంఖ్యను 900 నుంచి 800 కు తగ్గించారు.
ఈ నెల 22 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు. కాగా, ఇటీవలే శ్రీవాణి ట్రస్టును పాలకమండలి రద్దు చేసింది. ఈ ట్రస్టు ద్వారా విక్రయించే టికెట్ల సొమ్మును శ్రీవారి ఖజానాకు జమ చేయాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించింది.