Ancient Temple: టర్కీలోని పురాతన కోటలో ప్రాచీన ఆలయం.. పురావస్తు తవ్వకాల్లో వెలుగులోకి
టర్కీలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక పురాతన కోటలో జరిపిన తవ్వకాల్లో ఒక ఆలయాన్ని కనుగొన్నారు. ఈ ఆలయానికి అలనాటి కింగ్ మెనువాతో సంబంధం ఉందని అంచనా వేస్తున్నారు.
- By Hashtag U Published Date - 09:46 AM, Tue - 27 December 22

టర్కీలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక పురాతన కోటలో జరిపిన తవ్వకాల్లో ఒక ఆలయాన్ని కనుగొన్నారు. ఈ ఆలయానికి అలనాటి కింగ్ మెనువాతో సంబంధం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ దేవాలయం ఉన్న పురాతన కోట తూర్పు టర్కీలోని వాన్ జిల్లాలో ఉంది. ఇంతకు ముందు కూడా కింగ్ మెనువా నిర్మించిన మరో ఆలయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కోటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దాని పేరు ‘కోర్జుట్’. దీనిని క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దంలో కింగ్ మెనువా నిర్మించాడు.
వాన్ మ్యూజియంకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఈ కోటలో జరిపిన తవ్వకాలలో అనేక ముఖ్యమైన అంశాలు బయటపడ్డాయి. టర్కీ సాంస్కృతిక , పర్యాటక మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన తరువాత ఈ కోటలో తవ్వకం పనులు జరిపారు. ఈ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పురావస్తు త్రవ్వకాల కోసం టర్కీ ప్రభుత్వం నిధులు కూడా ఇస్తోంది.
కోటలో ఈ తవ్వకాలు వాన్ యుజుంకు యిల్ విశ్వవిద్యాలయం యొక్క ఆర్కియాలజీ విభాగం ప్రొఫెసర్ సబాహటిన్ అర్డోన్ నేతృత్వంలో జరుగుతున్నాయి. కోట లోపల కనిపించే ఈ ఆలయం కార్బెలింగ్ టెక్నిక్‌తో నిర్మించబడిందని అంటున్నారు. ఇందులో కుండల ముక్కలు మరియు లోహ కళాఖండాలు కూడా కనుగొనబడ్డాయి.
గుడి దగ్గర ఒక సమాధి..
“తవ్వకాలలో మేము మరొక ఆలయాన్ని కనుగొన్నాము.దీనిని రాజు మినువా నిర్మించినట్లు భావిస్తున్నాము. గుడి దగ్గర ఒక సమాధి కూడా దొరికింది. ఈ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో పురాతన కాలం నాటి పాత్రలు కూడా కనుగొనబడ్డాయి. ఇది తవ్వకానికి ముఖ్యమైన ప్రదేశం. ఇందులో దొరికిన పాత్రలు మధ్య యుగాల నాటివి. దీనితో పాటు.. కోట వెలుపల ఒక స్మశానవాటిక కూడా కనుగొనబడింది” అని ఆర్కియాలజీ విభాగం ప్రొఫెసర్ సబాహటిన్ అర్డోన్ చెప్పారు.