Neeraj Chopra : మన వజ్రం నీరజ్.. దోహా డైమండ్ లీగ్ కైవసం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) దోహా డైమండ్ లీగ్ (Doha Diamond League)లో డైమండ్ లా మెరిశాడు. తన తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.67 మీటర్లు విసిరి దోహా డైమండ్ లీగ్ టైటిల్‌ను శుక్రవారం కైవసం చేసుకున్నాడు.
- Author : Pasha
Date : 06-05-2023 - 8:12 IST
Published By : Hashtagu Telugu Desk
దోహా (ఖతర్) : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) దోహా డైమండ్ లీగ్ (Doha Diamond League)లో డైమండ్ లా మెరిశాడు. తన తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.67 మీటర్లు విసిరి దోహా డైమండ్ లీగ్ టైటిల్‌ను శుక్రవారం కైవసం చేసుకున్నాడు. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గ్రెనడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ వల్ల ఎదురైన ఓటమికి నీరజ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ పోటీలో మన నీరజ్ దూకుడును తట్టుకోలేక అండర్సన్ పీటర్స్ మూడో స్థానానికి పరిమితం అయ్యాడు. దోహా రాజధాని ఖతర్ లోని స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన పోటీలో నీరజ్ తొలి ప్రయత్నంలోనే 88.67 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరాడు. నీరజ్ వేసిన ఈ మొదటి త్రో పోటీలో అత్యుత్తమ త్రో గా నిలిచింది. ఇంతకు మించిన దూరం ఎవరూ జావెలిన్ వేయలేకపోయారు. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన చెక్ రిపబ్లిక్ ఆటగాడు జాకోబ్ వడ్లెజ్ ఈ పోటీ (Doha Diamond League)లో రెండో స్థానంలో నిలిచాడు. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లో మన నీరజ్ చోప్రాపై గెలిచి గోల్డ్ మెడల్ సాధించిన గ్రెనడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ .. ఈ లీగ్ లో మూడో స్థానంలో నిలిచాడు.
జావెలిన్ తో నీరజ్ ప్రదర్శన ఇలా..
* తొలి ప్రయత్నంలో – 88.67 మీటర్లు
* 2వ ప్రయత్నం – 86.04 మీటర్లు
* 3వ ప్రయత్నం – 85.47 మీటర్లు
* 4వ ప్రయత్నం – ఫౌల్
* 5వ ప్రయత్నం – 84.37 మీటర్లు
* 6వ ప్రయత్నం – 86.52 మీటర్లు
ALSO READ : Neeraj Chopra: ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదే.. అభిమానులతో నీరజ్‌చోప్రా ప్రవర్తనకు ఫిదా !

టాప్ 5 ఫైనల్ స్టాండింగ్స్
1. నీరజ్ చోప్రా (భారతదేశం) – 88.67 మీటర్లు
2. జాకుబ్ వడ్లెజ్చ్ (చెక్ రిపబ్లిక్) – 88.63 మీటర్లు
3. అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) – 85.88 మీటర్లు
4. జూలియన్ వెబర్ (జర్మనీ) 85.62 మీటర్లు
5.మారదారె ఆండ్రియన్ (మోల్డోవా) – 81.67 మీటర్లు
అమెరికాలోని యూజీన్ వేదికగా డైమండ్ లీగ్ ఫైనల్
దోహాలో జరుగుతున్న ఈ ఈవెంట్ డైమండ్ లీగ్ సిరీస్‌లో మొదటి దశ మాత్రమే. ఇది సెప్టెంబర్ 16, 17 తేదీల్లో అమెరికాలోని యూజీన్ నగరం వేదికగా డైమండ్ లీగ్ ఫైనల్స్ జరుగనున్నాయి. డైమండ్ లీగ్‌లో మొదటి స్థానంలో నిలిచిన ప్రతి అథ్లెట్‌కు 8 పాయింట్లు, రెండో ప్లేస్ లో ఉన్నవాళ్లకు 7 పాయింట్లు, మూడో ప్లేస్ లో ఉన్న వాళ్లకు 6, నాలుగు ప్లేస్ లో ఉన్నవాళ్లకు 5 పాయింట్లు ఇస్తారు.
ప్రస్తుత డైమండ్ లీగ్ ఛాంపియన్ మన నీరజే
జావెలిన్ తో ఇప్పటివరకు నీరజ్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. ఇది మనదేశ జాతీయ స్థాయి అత్యుత్తమ రికార్డు కూడా. అతడు 2018లో దోహా డైమండ్ లీగ్‌లో 87.43 మీటర్ల పర్ఫామెన్స్ తో నాలుగో స్థానంలో నిలిచాడు. ఫిట్‌నెస్ లేకపోవడంతో నీరజ్ గతేడాది దోహా డైమండ్ లీగ్ (Doha Diamond League)కు దూరమయ్యాడు. 2022 సెప్టెంబరులో స్విట్జ ర్లాండ్ లోని జూరిచ్‌లో జరిగిన 2022 గ్రాండ్ ఫినాలేలో గెలిచిన తర్వాత డైమండ్ లీగ్ లో ఛాంపియన్‌గా నిలిచిన మొదటి భారతీయుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు. అంతకు ఒక నెల ముందు.. అతడు స్విట్జ ర్లాండ్ లోని లాసాన్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్‌ను కూడా గెలుచుకున్నారు.