Badlapur Incident : 24 మహరాష్ట్ర బందుకు పిలుపునిచ్చిన ఎంవీఏ
బద్లాపూర్ ఘటనపై ఏక్నాథ్ షిండే సారధ్యంలోని మహాయుతి సర్కార్ రాజకీయాలకు తెరలేపిందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె బుధవారం ఆరోపణలు..
- Author : Latha Suma
Date : 21-08-2024 - 6:05 IST
Published By : Hashtagu Telugu Desk
Badlapur Incident:మహారాష్ట్రలోని థాణే జిల్లా బద్లాపూర్ (Badlapur)లో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన (Sexual Assault Case) తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ఈ ఘటనపై విపక్షాలు మహారాష్ట్ర సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బద్లాపూర్ ఘటనపై ఏక్నాథ్ షిండే సారధ్యంలోని మహాయుతి సర్కార్ రాజకీయాలకు తెరలేపిందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె బుధవారం ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఘటనకు నిరసనగా మహా వికాస్ అఘది (Maha Vikas Aghadi)(ఎంవీఏ) ఆగస్ట్ 24న మహారాష్ట్ర బంద్కు పిలుపు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. బద్లాపూర్ ఘటనను ప్రభుత్వమే రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో ఇటీవల మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 21000 ఈ తరహా ఘటనలు జరిగితే ప్రభుత్వం మౌనం దాల్చిందని నానా పటోలె మండిపడ్డారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను ఖండించిందని, త్వరలోనే నిందితుడిని కఠినంగా శిక్షిస్తుందని శివసేన నేత సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు.
కాగా, ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. చిన్నారులపై లైంగిక వేధింపులకు ఒడిగట్టిన కీచకుడిపై, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఉదయం తల్లిదండ్రులు స్థానికులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. కొందరు ఆగ్రహంతో పాఠశాలపై దాడికి పాల్పడి వస్తువులు ధ్వంసం చేశారు. అదేవిధంగా వందలాది మంది స్థానికులు రైల్వే స్టేషన్‌ను దిగ్బంధనం చేశారు. ఈ ఘటనపై స్థానిక ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ‘మహావికాస్ అఘాడి’ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై లైంగిక దాడి ఘటనకు నిరసనగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.