Man Returns After Rites : అతడికి అంత్యక్రియలు.. 13 రోజుల తర్వాత బతికొచ్చాడు
అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువకుడి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించారు.
- By Pasha Published Date - 09:09 AM, Tue - 11 June 24

Man Returns After Rites : అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువకుడి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత అతగాడు ఇంటికి ఫోన్ చేశాడు. అంతేకాదు.. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగొచ్చాడు. ఇంతకీ ఏమైంది ? అతడు ఎలా బతికొచ్చాడు ? తెలియాలంటే ఈ కథనం చదవండి.
We’re now on WhatsApp. Click to Join
అది మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లా లచ్చోడా గ్రామం. ఆ గ్రామానికి చెందిన యువకుడు సురేంద్ర శర్మ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఓ క్లాత్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. రెండు వారాల క్రితం రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ సమీపంలో ఉన్న సుర్వాల్‌లో జరిగిన ఒక ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సామాజిక కార్యకర్త బిహారీ సింగ్ సోలంకి ఆ యువకుడి ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టును చూసి లచ్చోడా గ్రామానికి చెందిన ఓ కుటుంబం స్పందించింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి తమ కుమారుడు సురేంద్ర శర్మ అయి ఉండొచ్చని వాళ్లు భావించారు. వెంటనే ఉరుకులు పరుగులతో రాజస్థాన్‌లోని సుర్వాల్‌కు చేరుకొని.. ఆ యువకుడిని మెరుగైన చికిత్స నిమిత్తం జైపూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరు యువకుడు చనిపోయాడు. దీంతో ఆ భౌతిక కాయాన్ని తమ గ్రామం లచ్చోడాకు తరలించి అంత్యక్రియలు చేశారు. చనిపోయింది తమ కుమారుడు సురేంద్ర శర్మ(Man Returns After Rites) అని వాళ్లు భావించారు.
ఈనేపథ్యంలో అంత్యక్రియలు జరిగే 10 రోజుల తర్వాత సురేంద్ర శర్మ ఫోన్ నంబరు నుంచి ఇంటికి ఒక వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేస్తే .. అటు వైపు నుంచి సురేంద్ర శర్మ లైవ్‌లో మాట్లాడుతున్నాడు. నేను బాగానే ఉన్నానని అతడు తన కుటుంబీకులకు చెప్పాడు. దీంతో వాళ్లంతా ఆనందించారు. తాము ఇంతకుముందు అంత్యక్రియలు నిర్వహించింది మరో గుర్తుతెలియని శవానికి అని గుర్తించారు. ఈ ఫోన్ కాల్ వచ్చాక సురేంద్ర శర్మ దశదిన కర్మ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కాల్ చేసిన మూడు రోజుల తర్వాత సురేంద్ర శర్మ ఇంటికి తిరిగొచ్చాడు. తన ఫోన్ పనిచేయకపోవడంతో గత రెండు నెలలుగా ఇంటికి కాల్ చేయలేకపోయానని అతడు వివరించాడు.