Amrit Tenders : ఢిల్లీకి పయనమైన కేటీఆర్
Delhi Tour : సృజన్‌రెడ్డికి చెందిన షోధ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిడెట్ కంపెనీపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు.
- By Latha Suma Published Date - 02:33 PM, Mon - 11 November 24
Delhi Tour : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఈ మేరకు ఆయన నేడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలవబోతున్నారు. అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై కేటీఆర్ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయబోతున్నారు. రూ. 8,888 కోట్ల విలువైన టెండర్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదికి అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెండర్ల విషయంలో సృజన్‌రెడ్డికి చెందిన షోధ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిడెట్ కంపెనీపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు.
మరోవైపు అమృత్ టెండర్ల పై కేటీఆర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని ఆయన అన్నారు. వ్యాపారాలు వేరు, రాజకీయాలు వేరన్నారు. కేటీఆర్ ఆరోపణలు చేసిన కంపెనీ తన అల్లుడిదని ఆయన చెప్పారు. నిబంధనల మేరకు కాంట్రాక్టు వచ్చిందని ఆయన అప్పట్లోనే ప్రకటించారు. ఈ ఆరోపణలపై ఎస్. సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. తనపై, తన కంపెనీపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని ఈ ఏడాది సెప్టెంబర్ 26న పంపిన లీగల్ నోటీసులో తెలిపారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా ఆ నోటీసులో ఎస్. సృజన్ రెడ్డి కోరారు.