Supreme Court : కోల్‌కతా ఘటన..బాధితురాలి పేరు, ఫోటోలను సోషల్ మీడియాలో తీసేయండి: సుప్రీంకోర్టు
లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం నిపున్ సక్సేనా కేసులో ఇచ్చిన సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే
- By Latha Suma Published Date - 01:32 PM, Wed - 21 August 24

Junior doctor rape and murder case: కోల్‌కతాలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ వైద్యురాలు అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే డాక్టర్ పేరు, ఫోటోలను, వీడియోలను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కోల్‌కతా కేసుపై విచారణ చేపట్టింది. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం నిపున్ సక్సేనా కేసులో ఇచ్చిన సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనన్నారు. బాధితురాలి మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలు వ్యక్తి గుర్తింపు, మృతదేహం ఛాయాచిత్రాలను ప్రచురించాయి. అందుకే కోర్టు నిషేధాజ్ఞను జారీ చేయవలసి ఉందని, అన్ని సామాజిక, ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి బాధితురాలి ఫొటోలు, పేరు’ తొలగించాలని సీజేఐ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
జూనియర్ వైద్యురాలి గుర్తింపును సోషల్ మీడియాలో బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది కిన్నోరి ఘోష్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. బాధితురాలి పేరు, సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ సహా ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తఅతంగా వ్యాపించాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరణించినవారి పేరు సోషల్ మీడియాలో ప్రచురించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
‘ఛాయాచిత్రాలు, వీడియో క్లిప్‌లు మీడియా అంతటా ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకరమైనది.’ అని కోర్టు అభిప్రాయపడింది. 2018లో నిపున్ సక్సేనా కేసు తీర్పులో అత్యున్నత న్యాయస్థానం ఇలా ఆదేశించింది. ‘ఎవరూ బాధితురాలి పేరును ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో ముద్రించకూడదు, ప్రచురించకూడదు. వారి వాస్తవాలను బహిర్గతం చేయకూడదు.’ అని సుప్రీం కోర్టు స్పష్టంగా ఆదేశించింది.
Read Also: Bharat Bandh: విజయవాడలో భారత్ బంద్.. స్తంభించిన రవాణా