Kolkata : కోల్‌కతా కేసు..నిందితుడికి లై డిటెక్టర్ పరీక్షకు హైకోర్టు అనుమతి
లై డిటెక్టర్ టెస్ట్ చేయాల్సిన అవసరముందని, అందుకు అనుమతి కావాలని సీబీఐ..కోర్టుని కోరింది.
- By Latha Suma Published Date - 05:35 PM, Mon - 19 August 24

Kolkata: కోల్‍కతాలోని ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రికి చెందిన జూనియర్ మహిళా వైద్యురాలి పై హత్యాచార నిందితుడికి లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు హైకోర్టు అంగీకరించింది. లై డిటెక్టర్ టెస్ట్ చేయాల్సిన అవసరముందని, అందుకు అనుమతి కావాలని సీబీఐ..కోర్టుని కోరింది. ఈ మేరకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రమంలో కోర్టు కూడా వేగవంతంగా విచారణ చేపడుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. తానే ఈ నేరం చేసినట్టు నిందితుడు అంగీకరించినట్టు తెలుస్తోంది.
ఇక పోతే.. ఈ కేసులో ప్రభుత్వం, కోల్‌కతా పోలీసుల నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు సీబీఐకి అప్పగించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌కి ”సైకలాజికల్ టెస్టు”ని సీబీఐ నిర్వహించింది. నిందితుడి మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ టెస్టుని నిర్వహించారు. నిన్న ఐదుగురు సీబీఐ వైద్యుల బృందం కోల్‌కతా చేరుకుని ఈ టెస్టుని నిర్వహించినట్లు తెలుస్తోంది. సైకలాజికల్ టెస్టులో నిందితుడి మానసిక విశ్లేషణ చేసి అంచనా వేయనున్నారు. ఇది అండర్ ట్రయల్స్‌లో వారి అలవాట్లు, దినచర్య, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చేస్తారు. ఈ పరీక్షలో, దర్యాప్తు సంస్థ సంజయ్ రాయ్ వాయిస్‌ని లేయర్డ్ వాయిస్ విశ్లేషణలో ఉంచవచ్చు, అంటే లై-డిటెక్టర్ పరికరం, దాని ద్వారా అతను నిజమే చెబుతున్నాడో లేదో నిర్ధారించుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో గత శుక్రవారం 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమె, రెస్ట్ తీసుకునేందుకు సెమినార్ హాలులో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, మహిళలు, సాధారణ ప్రజలు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.