Jyeshtha Purnima : జ్యేష్ఠాదేవిని తరిమేసి లక్ష్మీదేవికి వెల్కమ్ చెప్పే టైం
జ్యేష్ఠ పూర్ణిమ(Jyeshtha Purnima) రోజున వ్రతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈసారి జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి జూన్ 3న ఉదయం 11:16 గంటలకు ప్రారంభమై జూన్ 4న ఉదయం 09:11 గంటలకు ముగుస్తుంది. జూన్ 4న పవిత్ర స్నానం చేస్తారు.
- By Pasha Published Date - 10:53 AM, Tue - 30 May 23

సనాతన సంస్కృతిలో పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో ఒక పౌర్ణమి లెక్కన సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణములు వస్తాయి. పౌర్ణమి నాడు చంద్రుడు తన 16 కళలతో సంపూర్ణంగా ఉంటాడు. సంవత్సరంలోని ప్రతి పూర్ణిమ తిథి రోజున ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జ్యేష్ఠ పూర్ణిమ(Jyeshtha Purnima) రోజున వ్రతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈసారి జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి జూన్ 3న ఉదయం 11:16 గంటలకు ప్రారంభమై జూన్ 4న ఉదయం 09:11 గంటలకు ముగుస్తుంది. జూన్ 4న పవిత్ర స్నానం చేస్తారు. జ్యేష్ఠ మాసంలోని చివరి రోజున స్నానం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుంది. జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు వస్తాయి.
చంద్ర దోషం నుంచి విముక్తి
జ్యేష్ఠ పూర్ణిమ ఉపవాసం రోజున రాత్రి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మానసిక బాధలు, ఆందోళనలు, కలతలు దూరమవుతాయి.జాతకంలో చంద్ర దోషం ఉంటే.. దాని నుంచి విముక్తి లభిస్తుంది. జ్యేష్ఠ పూర్ణిమ(Jyeshtha Purnima) నాడు సత్యనారాయణ స్వామి కథను వినడం లేదా పఠించడం వల్ల పుణ్య ఫలం దక్కుతుంది. ఈ ప్రత్యేకమైన రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది. జ్యేష్ఠాదేవిని తరిమేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలంటే ఈ రోజున కొన్ని పరిహారాలు పాటిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం రోజున మూడు చాలా పవిత్రమైన సమయాలు కలిసి వస్తాయని పంచాంగంలో పేర్కొన్నారు. ఈ రోజున అనురాధ నక్షత్రం పూర్తి రాత్రి ఉంటుంది. ఈ ప్రత్యేక రోజున సిద్ధయోగం ఏర్పడుతోంది. ఇది జూన్ 3న మధ్యాహ్నం 02.48 గంటలకు ప్రారంభమై పూర్తి రాత్రి వరకు ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం రోజున కూడా వట సావిత్రి పూర్ణిమ వ్రతాన్ని పాటిస్తారు.
Also read : Vata Savitri Vratam 2023 : యముడిని సతీ సావిత్రి మెప్పించేలా చేసిన “వ్రతం” .. మే 19న!!
లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే పరిహారాలివీ
- జ్యేష్ఠ పూర్ణిమ రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి.
- సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి.
- ఈ రోజున కనకధార స్త్రోత్రం, అష్టలక్ష్మీ స్త్రోత్రం పఠించడం వల్ల సిరిసంపదలకు లోటుండదని పురాణాలు చెబుతున్నాయి.
- 11 గవ్వలకు పసుపు రాసి లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచాలి. అనంతరం పసుపు లేదా కుంకుమతో తిలకాన్ని దిద్ది పూజించాలి. ఆ మరుసటి రోజు వాటిని ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో లేదా అల్మరాలో ఉంచాలి.
- జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి పాయసాన్ని నివేదిస్తే ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయంటారు.
- జ్యేష్ఠ పూర్ణిమ రోజు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి విష్ణు సహస్రనామం పఠించడం కూడా ప్రయోజనకరం.
Also read : Nirjala Ekadashi 2023 : భీముడికి వ్యాసుడు చెప్పిన వ్రతం
వట పూర్ణిమ వ్రతం
జ్యేష్ఠ పూర్ణిమ రోజునే.. వట పూర్ణిమ వ్రతం కూడా చేస్తారు. వివాహిత స్త్రీలు మర్రి చెట్టును పూజించి 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. భర్త దీర్ఘాయువు, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించమని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉపవాసాన్ని ఉత్తర భారతదేశంలో వట సావిత్రి వ్రతం అంటారు. ఆధ్యాత్మిక పరంగా మర్రిచెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టు బెరడులో విష్ణువు, వేరులో బ్రహ్మ, కొమ్మల్లో శివుడు ఉంటారని విశ్వసిస్తారు. శివుడు కూడా మర్రిచెట్టు కింద ధ్యానం చేశాడని చెబుతారు.
మర్రిచెట్టును పూజిస్తే…
- వ్యాపారం, ఉద్యోగంలో వచ్చిన కష్టనష్టాల నుంచి బయటపడాలంటే మర్రిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగించాలి.
- ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే, రాత్రిపూట వారి దిండుకింద మర్రివేరు ఉంచితే ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతుందని విశ్వసిస్తారు.
- మర్రిచెట్టు కింద హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
- శనివారం మర్రి కాండం మీద పసుపు, కుంకుమ సమర్పించడం వల్ల వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది.
- ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే, గుడి దగ్గరున్న మర్రి చెట్టు కొమ్మను తీసుకొచ్చి పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెబుతారు.
- మర్రి చెట్టుపై తెల్లటి నూలు దారాన్ని 11 సార్లు కట్టి నీరుపోస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.