Jani Master : జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్
Jani Master : రెండు లక్షల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని పేర్కొంది. ఈ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, అలాగే మరో మారు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని కోర్టు ఆదేశించింది.
- By Latha Suma Published Date - 12:43 PM, Thu - 3 October 24

Interim Bail : పోక్సో చట్టం కేసులో అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చింది. ఈనెల 6 నుండి 10వ తేది వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా రంగారెడ్డి జిల్లా కోర్టు తెలిపింది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని అందుకుగాను బెయిల్‌కు జానీ మాస్టర్ దరఖాస్తు చేసుకోగా.. పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది. అక్టోబరు 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ఎదుట హజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. రెండు లక్షల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని పేర్కొంది. ఈ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, అలాగే మరో మారు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని కోర్టు ఆదేశించింది.
Read Also: Nagarjuna : మంత్రి సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న నాగార్జున..?
జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ”2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశాను. అయినా సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానీయకుండా ఇబ్బంది పెట్టాడు” అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయన్ని అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. మరోవైపు, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు ఇటీవల జాతీయ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్టోబర్‌లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవానికి హాజరై.. పురస్కారం అందుకోవడం కోసం ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.