PM Modi : భారతదేశం ప్రపంచ శక్తిగా మార్పు చెందింది : ప్రధాని
ప్రపంచ కర్మాగారంగా భారత్ రూపొందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని వ్యాఖ్యానించారు.
- By Latha Suma Published Date - 02:09 PM, Sat - 1 March 25

PM Modi : దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో భాగంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇన్నేళ్లు శ్రామిక శక్తిగా పేరుపొందిన భారతదేశం ప్రస్తుతం ప్రపంచ శక్తిగా మార్పు చెందిందని అన్నారు. సెమీకండక్టర్లు, విమాన వాహక నౌకల తయారీ వంటి వాటిలో వేగంగా అభివృద్ధి చెందుతూ.. ఆటోమొబైల్ ఉత్పత్తిదారుగా మారిందని పేర్కొన్నారు. దేశంలో లభించే సూపర్‌ఫుడ్‌లైన మఖానా, మిల్లెట్‌లు, ఆయుష్ ఉత్పత్తులు, మనం పాటించే యోగా, ధ్యానం వంటి వాటిని విదేశీయులు ఆచరిస్తున్నారన్నారు.
Read Also: TG High Court : తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్ షోల పై హైకోర్టు కీలక తీర్పు
ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాలుగా భారత్‌ను ఓ ఉప శాఖగా చూశాయని.. కానీ ప్రస్తుతం ఆ విధానం పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. ప్రపంచ కర్మాగారంగా భారత్ రూపొందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల ప్రజలు భారత్‌కు రావాలని కోరుకుంటున్నారన్నారు. భారత్ అభివృద్ధిలో ముందడుగు వేస్తూ అనేక ప్రపంచవ్యాప్త కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తోందని అన్నారు.
ఇటీవల పెద్దఎత్తున నిర్వహించిన మహాకుంభమేళా భారతదేశం పాటించే నిర్వహణానైపుణ్యాలు, ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో కాలంచెల్లిన అనేక చట్టాను రద్దు చేసి.. కొత్త వాటిని రూపొందించామని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మూడోసారి పట్టం కట్టడం వారికి తమపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రారంభిస్తున్న కొత్త గ్లోబల్ న్యూస్ ఛానల్ దేశం సాధించిన విజయాలను.. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించాలనే తన ప్రయత్నాన్ని విదేశాలకు తెలియజేస్తుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.