Supreme Court : ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని, హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మళ్లీ పునర్విమర్శ జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మిపై మళ్లీ విచారణ జరుగనుంది. హైకోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ నిర్ణయం చట్టపరంగా సరైనది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
- By Latha Suma Published Date - 01:29 PM, Wed - 7 May 25

Supreme Court : ఓబుళాపురం మైనింగ్ కుంభకోణానికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి బి. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. 2022లో తెలంగాణ హైకోర్టు ఈ కేసులో ఆమెను డిశ్చార్జ్ చేస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా తిరస్కరించింది. ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని, హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మళ్లీ పునర్విమర్శ జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మిపై మళ్లీ విచారణ జరుగనుంది. హైకోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ నిర్ణయం చట్టపరంగా సరైనది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తద్వారా ఈ కేసులో ఆమెపై మళ్లీ ఆరోపణలు కొనసాగే అవకాశం కలిగింది. తద్వారా ఓఎంసీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
Read Also: Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’.. సౌత్ సినీ స్టార్స్ స్పందన ఇదీ
ఇక మంగళవారం ఓఎంసీ అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్దన రెడ్డికి పాటు మరో ముగ్గురు బి.వి. శ్రీనివాసరెడ్డి, వి.డి. రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్‌లకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. అదనంగా రూ.20 వేల జరిమానా కూడా విధించింది.ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్‌కు అదనంగా నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. నిందితులు విధించిన జరిమానాలను చెల్లించకపోతే, అదనంగా ఆరు నెలల సాధారణ శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్‌కి కూడా రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించడమే కాకుండా, వేర్వేరు సెక్షన్ల కింద వేర్వేరు శిక్షలు విధించినప్పటికీ, అవన్నీ ఏకకాలంలో అనుభవించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇదివరకే నిందితులు జైలులో గడిపిన కాలాన్ని ఈ శిక్షల నుంచి మినహాయించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో ఓఎంసీ కేసులో న్యాయ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నప్పటికీ, శ్రీలక్ష్మిపై విచారణ పునఃప్రారంభం కావడం కేసును మరో కీలక దశలోకి తీసుకెళ్తోంది.
Read Also: Pahalgam Terror Attack : ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల యోధులకు నా సెల్యూట్ : సీఎం చంద్రబాబు