Heart Vest : గుండెపోటును ముందే పసిగట్టే ‘బనియన్’
Heart Vest : మెడికల్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్తకొత్త ఆవిష్కరణలు మార్కెట్లోకి వస్తున్నాయి.
- By Pasha Published Date - 02:51 PM, Wed - 27 December 23

Heart Vest : మెడికల్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్తకొత్త ఆవిష్కరణలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈక్రమంలోనే ఆకస్మికంగా సంభవించే గుండెపోటు మరణాల ముప్పును తగ్గించే ఒక ఆవిష్కరణ జరిగింది. ఆకస్మిక గుండె వైఫల్యంతో జరిగే మరణాల ముప్పును ముందస్తుగా పసిగట్టగలిగే ఒక బనియన్‌ను బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీన్ని 77 మంది రోగులపై పరీక్షించారు. ఫలితంగా ఈ బనియన్ విశ్వసనీయమైందేనని వెల్లడైంది. హైపర్‌ట్రోపిక్ కార్డియోమయోపతి, డయలేటెడ్ కార్డియోమయోపతి వంటి సమస్యలున్న రోగుల్లో గుండెను మ్యాప్ చేయడానికి దీన్ని ప్రస్తుతం వాడుతున్నారు. గుండెలో విద్యుత్ చర్యల తీరుతెన్నులను ఈ బనియన్ నిశితంగా ట్రాక్ చేయగలదు. దీన్ని ఎలక్ట్రోకార్డియోగ్రాఫిక్ ఇమేజింగ్ (ఈసీజీఐ) బనియన్ అని పిలుస్తారు. ఇది గుండెలోని విద్యుత్ వ్యవస్థను అతి తక్కువ ఖర్చులోనే వేగంగా స్క్రీన్ చేయగలదు. కేవలం ఐదు నిమిషాలలోనే స్క్రీనింగ్ ప్రక్రియను ఇది(Heart Vest) పూర్తి చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఈసీజీఐ బనియన్‌లో 256 సెన్సర్లు ఉన్నాయి. ఇవి గుండెలో జరిగే ఎలక్ట్రిక్ యాక్టివిటీ డేటాను సేకరిస్తాయి. ఆ వివరాలను ఎమ్మారై ఇమేజ్‌లతో కలగలిపి గుండె గుండా పయనించే విద్యుత్ చర్యల తరంగాలకు సంబంధించి త్రీడీ డిజిటల్ మోడళ్లను తయారు చేస్తుంది.
- గుండెలోని కండర కణజాలం హెల్తీగా ఉందా లేదా అనే విషయాన్ని ఈ బనియన్ తీసే ఎంఆర్ఐ రిపోర్టు ద్వారా తెలుసుకోవచ్చు.
- గుండెలో చనిపోయిన కండర కణాలు ఎక్కడ ఉన్నాయనేది ఈ బనియన్ తెలియజేస్తుంది. చనిపోయిన కండర కణాల వల్లే గుండెలో అంతర్గత విద్యుత్ సప్లైలో నెగెటివ్ ఎఫెక్టు పడుతుంది.
- ఈ సమాచారం మొత్తాన్ని కలుపుకొని భవిష్యత్‌లో సదరు వ్యక్తి గుండెకు ఎంతమేర ముప్పు ఉందనే అంచనాకు డాక్టర్లు వస్తారు.
- ఈ వివరా ల ఆధారంగా రోగుల గుండెలో సకాలంలో ఇంప్లాంటబుల్ కార్డియోవెర్టర్ డిఫిబ్రిలేటర్ (ఐసీడీ)ను అమర్చే వీలు కలుగుతుంది.
- ఈ బనియన్ గుండె లయను పర్యవేక్షిస్తుంది. అవసరమైతే షాక్ ఇవ్వడం ద్వారా సాధారణ లయను పునరుద్ధరిస్తుంది.