KCR: కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ..కాళేశ్వరం విచారణ నోటీసుల నేపథ్యంలో కీలక మంతనాలు!
హరీశ్ రావు గురువారం ఉదయం ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీకి గల ప్రధాన కారణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వ్యవహారమే. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టు పనులపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తోంది.
- By Latha Suma Published Date - 03:16 PM, Thu - 22 May 25

KCR : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కీలక భేటీ నిర్వహించారు. ఇటీవలే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి వచ్చిన నోటీసుల నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. హరీశ్ రావు గురువారం ఉదయం ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీకి గల ప్రధాన కారణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వ్యవహారమే. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టు పనులపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ నాణ్యత, డిజైన్ లోపాలు, నిర్మాణంలో నిర్లక్ష్యం వంటి అనేక అంశాలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.
Read Also: Nadendla Manohar : కొత్త రేషన్‌కార్డు దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు, అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లకు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. వీరు అందరూ 15 రోజుల్లోగా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న నేతలపై ఆరోపణలు వచ్చిన ఈ సమయంలో, కేసీఆర్-హరీశ్ భేటీకి ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వెనుకబడిన నేపథ్యంలో ఈ భేటీ పార్టీ లోపలి వ్యూహాల పునర్నిర్మాణానికి సంకేతమా? లేక కమిషన్ విచారణకు సంబంధించి ఒకే వ్యూహంతో ఎదుర్కొనడానికి ముందస్తు సన్నాహమా? అన్న చర్చలు సాగుతున్నాయి.
హరీశ్ రావు ఇప్పటివరకు కమిషన్ నోటీసులపై స్పందించకపోయినా, ఈ భేటీ ద్వారా ఆయన తలపెట్టిన దిశపై స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ పరంగా చూస్తే, కాళేశ్వరం అంశం ఆయన పరిపాలనలో కీలక ప్రాజెక్టుగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి వచ్చిన విమర్శలు, ఇప్పుడు విచారణ దశకు చేరిన నేపధ్యంలో, ఆయనపై మరింత ఒత్తిడి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రుల భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ముందు ముందు కమిషన్ విచారణ ఎలా సాగుతుంది? నేతలు దానికి ఎలా స్పందిస్తారు? అనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.