Diversion Politics : భళా! సనాతనం!! `భారత్` రాజకీయం.!!
Diversion Politics : ఏ ధర్మం ఎవరు పాటిస్తున్నారో , అర్ధం కావడం లేదు! ఏమిటస్సలు? ప్రజాస్వామ్య దేశం లోనే వున్నామా?
- By CS Rao Published Date - 04:16 PM, Fri - 8 September 23

Diversion Politics : ఏ ధర్మం ఎవరు పాటిస్తున్నారో , అర్ధం కావడం లేదు! ఏమిటస్సలు? ప్రజాస్వామ్య దేశం లోనే వున్నామా? రాజకీయ దేశం లో వున్నామా? ప్రతిదీ రాజకీయమేనా? ప్రశ్నిస్తే దేశ ద్రోహి ముద్ర వేసేయడమేనా? సనాతన ధర్మం నిర్మూలించాలి అని తమిళనాడు మంత్రి, హీరో ఉదయ నిధి అన్నారు. తమిళనాడు డిఎంకె ఎంపి రాజా ఇంకో అడుగు ముందుకేసి సనాతన ధర్మం ఎయిడ్స్ వ్యాధిలాంటిదని పోల్చారు. అలా ఒక ధర్మాన్ని కించ పరిచేలా మాట్లాడటం తప్పు తప్పే..! ఎవరి మనోభావాలను దెబ్బ తీసే అధికారం ఎవ్వరికీ లేదు. అది హిందూ ధర్మం అయినా ఇస్లాం ధర్మం అయినా ఇంకే మత ధర్మం అయినా ఆనాటి కాల పరిస్థితులను బట్టి మంచి అనిపించవచ్చు. చెడు అనిపించవచ్చు. ప్రతి విషయం లోనూ మంచి చెడు ఉంటాయి. అది లోక ధర్మం.
సనాతన ధర్మం లోని అప్పటి సతీ సహగమానాలు ఇప్పుడు లేవు (Diversion Politics)
వేల సంవత్సరాల క్రితం అప్పట్లో ఏ టెక్నాలజీ అందుబాటులో లేని కాలం లో రూపొందించిన ధర్మాలు అవి. కాలక్రమేణా అన్ని మారుతూ వచ్చాయి. సనాతన ధర్మం లోని అప్పటి సతీ సహగమానాలు ఇప్పుడు లేవు. బాల్య వివాహాలు చాలా వరకు తగ్గు ముఖం పట్టాయి. ఇలా చెప్పుకుంటూ పోతే, అప్పట్లో నిర్ణయించిన ఆ కాలానికి తగినట్లు అప్పట్లో మంచి అనుకున్న చాలా ధర్మాలు కనుమరుగయ్యాయి. చాలా వరకు కాలం మారే కొద్దీ మార్పు సహజం. ప్రతి జనరేషన్ కు కొన్ని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఎందులో మార్పు వచ్చినా రాకున్నా స్త్రీ పురుష సమానత్వం, కుల మతాల వివక్ష లో మాత్రం ఏం తేడా లేదు. యువతరం వీటిని కూడా ప్రక్షాళన చేసే ప్రయత్నం చేసిన ప్రతి సారి పెద్దలు అడ్డు పడుతూనే ఉన్నారు, ఉంటారు కూడా.(Diversion Politics)
అంతా డైవర్ట్ పాలిట్రిక్స్ (Diversion Politics)
నిజానికి ఉదయ నిధి అన్నాడంటే అది అతడి ఆలోచన. అతను అన్నంత మాత్రాన సనాతన ధర్మం నిర్మూలం అయిపోతుందా? ఎందుకంత ఆందోళన? అతనికి స్వేచ్చ లేదా? ఇది ప్రజాస్వామ్య దేశమేగా.. అతడి వ్యాఖ్యలు అభ్యంతరం వున్నవారు ఖండించడం లో తప్పు లేదు. కానీ దాడులు చేయడం, తల నరికితే 10కోట్లు , 100 కోట్లు అని ప్రకటించడం ఎంత వరకు ధర్మం? అదేం ధర్మమా? మరో వైపు ప్రభుత్వాలు కూడా అలాగే ఏడ్చాయి. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకుంటున్నాయి. పరిపాలన పై దృష్టి లేదు. ప్రజల జీవితాలను మార్చడం లేదు కానీ, పేర్లు మార్చడం లో, నోట్లు రద్దు చేయడం లో, ఆధార్ తో ఆడుకోవడంలో అనేక తలకు మాసిన నిర్ణయాలు తీసుకుంటూ ఆందోళన కు గురి చేస్తున్నాయి. జనాన్ని ఏమార్చడం లో విజయం సాధిస్తున్నాయి. అంతా డైవర్ట్ పాలిట్రిక్స్ (Diversion Politics)
ప్రభుత్వం మెప్పు కోసం కొందరు సమర్థించి ఉండొచ్చు
ఇండియా, భారత్ రెండూ రాజ్యాంగం లో ఉన్న పేర్లే. ఇప్పుడు కొత్తగా మార్చినట్లు కలర్ వేయడం లో అర్ధమే లేదు. ప్రతిపక్షాలు ఇండియా అని పెట్టుకున్నాయని, అసలు ఇండియా వద్దు అనుకుంటే ఎలా? చిన్నప్పుడు చదువుకున్న ప్రతిజ్ఞ లోనే ఇండియా అని ఉంది. భారత దేశం నా మాతృభూమి అని ఉంది. మారిన రాజకీయాలు ఆ ప్రతిజ్ఞ కే అర్ధం లేకుండా చేస్తున్నాయి. సోదర సౌభ్రాత్రుత్వం కు తూట్లు పొడిచేస్తున్నాయి. ఊర్ల పేర్లు మార్చడం మొదలుపెట్టి ఇప్పుడు దేశం పేరు కూడా మార్చి ఏదో చేసేస్తున్నాం అని భ్రమ కలిగిస్తున్నారు. ఆంగ్లం లో ఇండియా, హిందీ లో భారత్. ఇండియా కాదు భారత్ మాత్రమే ఉండాలి అంటే జనానికి ఇక్కట్లే.(Diversion Politics)
Also Read : YCP Special status : BJPతో కాపురం, కాంగ్రెస్ తో ప్రేమాయణం!జగన్ లక్ !!
పాసుపోర్టు నుంచి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు ఇలా ప్రతి ఒక్కరూ అన్నీ మార్చుకోవాల్సి వస్తుంది. ఆఖరకు కరెన్సీ కూడా ప్రభుత్వం మార్చాలి. దేశం లో వున్న అన్ని బోర్డులు మార్చాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి రైల్వేస్ వరకు అన్నీ మార్పులు ఉండాలి. పాలకులు ఏదయినా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని విషయాలు ఆలోచన చేయాలి. నిరంకుశ పాలన అయితేనే ఇలా ఏక పక్ష నిర్ణయాలు ఉండి జనాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. ప్రభుత్వం మెప్పు కోసం కొందరు సమర్థించి ఉండొచ్చు. వాస్తవంగా పాలకులు (Diversion Politics) ఆలోచించాలి.
నిజానికి కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోలేదు. అలా అని గొప్ప మార్పులు జరగలేదు అది వేరే విషయం. బీజేపీ పాలనలో మాత్రం దేశభక్తి పెద్ద సెంటిమెంట్ గా మార్చేశారు. నిజానికి దేశభక్తి కుల మతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరిలో ఉంటుందిన. మోదీ మాత్రం తమకే పేటెంట్ లా భావిస్తున్నారు. ఎన్నికల సమయం లో దేశభక్తి ఏదొక విధంగా రగిలించి రచ్చ చేయించడం, సరిహద్దుల్లో ఏదొక సందడి చేసి యుద్ధ వాతావరణం సృష్టించి తమ పరిపాలన లో తిరుగులేదని ప్రచారం చేయడమే కనిపిస్తోంది. విషయం ఏమిటంటే పరిపాలన పడకెక్కింది. రాజకీయం (Diversion Politics)మాత్రమే రాజ్యమేలుతోంది.
దేశభక్తి ఏదొక విధంగా రగిలించి రచ్చ చేయించడం
నిజానికి సమాజం లో రచ్చ చేసే వారికి రాజకీయం తెలియదు. ఏ అంశం పైనా పూర్తి అవగాహన ఉండదు. ఎవరో జ్వాల ను రగిలిస్తారు. ఏదో జరిగిపోయినట్లు ఇక్కడ రెచ్చిపోతారు. ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు గోల చేస్తున్న చాలా మందికి సనాతన ధర్మం గురించి తెలియదు. భారత్ మార్పు తో వచ్చే ఇబ్బందుల గురించి తెలియదు. ఇండియా, భారత్ మెదటి నుంచి వున్నవే అన్న విషయమూ తెలియదు. ఉదయ నిధి ప్రశ్నించాడు… పార్లమెంట్ ప్రారంభోత్సవం లో రాష్ట్రపతి ముర్ము గారికి ఆహ్వానం లేదు, ఆ వివక్ష ను తొలగించాలి. ఆమె మహిళ అని పిలవలేదా? ఆదివాసీ అని పిలవ లేదా అని ప్రశ్నించాడు. దానికి జవాబు లేకుండా సనాతన ధర్మం పై మాత్రమే నిన్న మోదీ స్పందించారు. ప్రధాన మంత్రి హోదాలో వున్న వ్యక్తి ఉదయ నిధి మాటలకు స్పందించాల్సిన అవసరం వుందా? మణిపూర్ సంఘటన పై నోరు విప్పాలేదేం? దేశం లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరో వైపు “అ” “ఆ” గ్రూపులు దేశంలోని అన్నిటిని కొనేస్తున్నాయి. ఇవేమి పట్టకుండా మాటలతో రచ్చలతో టైం పాస్ బాగా చేసేస్తున్నారు.
నిజానికి ఇదొక పెద్ద కుట్ర రాజకీయం అయి ఉండొచ్చు. మోదీ షా లకు స్టాలిన్ కు మధ్య అవగాహన ఒప్పందం కావచ్చు. డైవర్ట్ పాలిటిక్స్ లో భాగం కావచ్చు. స్టాలిన్ తన కుమారుడితో ఒక వివాదాస్పద వ్యాఖ్య పెద్దల ఒప్పందం లో భాగంగా జరిగి ఉండొచ్చు. అది తెలియక దేశం అంతా రచ్చ రచ్చ గా మారింది. అసలు విషయాలు తెర మరుగు అయిపోయాయి.
సనాతన ధర్మం అంటే..? (Diversion Politics)
సనాతన ధర్మం అంటే నిత్యమైన మార్పు చెందని శాశ్వతమైన జీవన విధానం అని అర్ధం. హిందువులు పాటించే ధర్మం సనాతన ధర్మం. కానీ వేదాల్లో ఎక్కడా సనాతన ధర్మం ప్రస్తావన లేదు. ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ, ద్వాపర యుగం లో మహా భారత సంగ్రామం లో ఈ ప్రస్తావన మొదటి సారి వచ్చినట్లు తెలుస్తోంది. అర్జునుడు ఈ ధర్మం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
అసలు ఈ ధర్మం ఏం చెబుతుందంటే…కర్మ సిద్ధాంతం గురించి చెబుతుంది. పునర్జన్మ, ఆత్మ లు ఉన్నాయని, కర్మ ను బట్టి ఫలితం అనుభవించక తప్పదని బోధిస్తోంది. అయితే హిందువుల్లో భిన్న సంస్కృతీ సంప్రదాయాలు, కులాలు, ఆచారాలు ఉన్నాయి. మూఢ నమ్మకాలూ కూడా ఎక్కువగా విశ్వసించే వారు ఆ రోజుల్లో! ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, సంఘ సంస్కరణ ఉద్యమాలు మూలంగా కాలానుగుణంగా మార్పులు జరుగుతూ వచ్చాయి. నాస్తికులు కూడా ఉన్నారు. సామాజిక న్యాయం, స్వేచ్ఛ సమానతలు కోరుకోవడం ఆరంభించారు. మరో వైపు బలవంతపు మత మార్పిడులు మొదలయ్యాయి. ఈ మార్పును జీర్ణించుకోలేని పెద్దలు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, హిందూ మతాన్ని కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. ఆ చైతన్యం తర తరాలుగా కొనసాగుతూనే ఉంది.(Diversion Politics)
Also Read : BJP: దటీజ్ బిజెపి టైమింగ్
నిజానికి సనాతన ధర్మం కూడా శాంతిని ప్రభోదిస్తుంది. దేవుడ్ని పూజించడం, ప్రకృతిని ఆరాధించడం, పెద్దలను గౌరవించడం, అధ్యయనం చేయడం, పరిశోధన, పరిశీలన, నేర్చుకోవడం.. ఎలాంటి సాయమైనా ఇతరులకు అవసరం అయినవారికి చేయడం, తద్వారా పరులకు సహాయపడే గుణం అలవరుచుకోవడం, మనసును ప్రశాంతం గా ఉంచుకుని ఇతరులను ద్వేషించకుండా ఉండటం, ఇతరులను బాధ పెట్టకుండా ఉండటం, అబద్ధాలు ఆడకుండా సత్యం పాటించడం, ధైర్యంగా ముందుకు వెళ్లడం, అనుకున్న లక్ష్యాన్ని సాధించడం, క్షమించే గుణం కలిగి ఉండటం, ఎదుటివారిని ప్రేమించే గుణం పెంపొందించుకోవడం, పిసినారితనం లేకుండా, అనవసర విషయాల పట్ల ఆశ పడకుండా ఉండటం…ఇలా ఈ ధర్మాలన్ని నిజానికి అన్ని మతాల్లోను వున్నవే. సర్వ మత సారం ఇదే! కానీ, పాటించేది ఎవరు?
Also Read : PM Modi Host Dinner: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రధాని మోదీ ప్రత్యేక విందు..!
సనాతన ధర్మం హైందవ ధర్మం ఒక్కటే. అయితే ద్వాపర యుగం లో మాదిరిగా ఇప్పటి కలి యుగం లో ఉండలేం. సనాతన ధర్మం గురించి ఉదయనిధి కి తెలియదు. రచ్చ చేస్తున్న వారికీ తెలియదు. అవగాహన లేకుండానే అందరూ రచ్చ చేసుకుంటున్నారు. ఎవరి మతం వారికి గొప్ప. కానీ ఇతర మతాలను కించ పరచమని ఏ ధర్మం చెప్పలేదు. సనాతన ధర్మం చాలా విస్తృతమైనది. హిందూ సనాతన, ఇస్లాం, క్రైస్తవ, బుద్ధిజం తదితర ధర్మాలను మిళితం చేసుకుని భారతదేశం తర తరాలుగా కొనసాగుతోంది. మంచి ని తీసుకుంటూ చెడును వదిలించుకుంటూ ముందుకు వెళ్లడమే జీవితం. ఏ మతం లో అయినా అమానవీయ ధర్మాలు ఉంటే నిర్మూలించి తీరాల్సిందే. అవేశాలు అనర్ధాలు కాకుండా, అన్నిటికన్నా శాంతి మాత్రమే ముఖ్యం అని చెప్పే అసలు ధర్మం పాటించకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటే ఇంకే ధర్మం పాటిస్తున్నట్లు.!