DIESEL VEHICLES BAN : 2027 నాటికి డీజిల్ వెహికల్స్ బ్యాన్ ?
డీజిల్.. దీనితోనే నిత్యం కార్లు, ట్రక్కులు, లారీలు, బస్సులు, ట్రాలీలు, ఆటోలు నడుస్తుంటాయి. డీజిల్ తో నడిచే ఈ వెహికల్స్ వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం కలుగుతోంది. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈనేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఒక మిలియన్ (10 లక్షల) కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో 2027 సంవత్సరం నుంచి ఫోర్-వీలర్ డీజిల్ వెహికల్స్ ను పూర్తిగా బ్యాన్ (DIESEL VEHICLES BAN) చేయాలని మాజీ పెట్రోలియం సెక్రటరీ తరుణ్ కపూర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన శక్తి పరివర్తన సలహా కమిటీ సర్కారుకు సిఫార్సు చేసిందట.
- By Pasha Published Date - 08:21 AM, Sun - 14 May 23

కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?
చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్ తర్వాత కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే నాలుగో అతిపెద్ద దేశం భారత్. అయినా మనం అమెరికా కంటే ఆరు రెట్లు తక్కువ.. చైనా కంటే మూడు రెట్లు తక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాం. వాతావరణంలోకి రిలీజ్ అయ్యే కార్బన్ ఉద్గారాలను 2070 నాటికి సున్నాకు చేర్చాలి అనేది కేంద్ర ప్రభుత్వం టార్గెట్. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహన రంగానికి, సోలార్ పవర్ వాడకానికి ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఒక నివేదిక ప్రకారం 2040 సంవత్సరం నాటికి మన దేశంలో డీజిల్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత అది తగ్గడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే అప్పటికి ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై తిరగడం ప్రారంభిస్తాయి. 2030 సంవత్సరం తర్వాత గృహావసరాల వంట గ్యాస్ డిమాండ్ తగ్గడం ప్రారంభిస్తుంది. 2070 నాటికి ఆ డిమాండ్ పూర్తిగా ముగుస్తుంది. ఎందుకంటే అప్పటికి విద్యుత్ శక్తిని వంట కోసం పూర్తిగా వినియోగిస్తారు.అయితే పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగం ఎంత త్వరగా తగ్గుతుందనేది.. ప్రాథమికంగా ఆటో రంగం ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంత వేగంగా మారుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ..
2027 సంవత్సరం నుంచి ఫోర్-వీలర్ డీజిల్ వెహికల్స్ పూర్తిగా బ్యాన్ అవుతాయనే వార్తలపై ట్విట్టర్ ద్వారా కేంద్ర పెట్రోలియం శాఖ వివరణ ఇచ్చింది. 2027 నాటికి డీజిల్ వాహనాల బ్యాన్ ప్రతిపాదన ఇంకా ఆమోదించబడలేదని స్పష్టం చేసింది. కాలుష్య ఉద్గారాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చిందని, ఇది భవిష్యత్తుకు సంబంధించినదని వెల్లడించింది. ఇది ఇంకా చర్చల దశలోనే ఉందని.. ఇంకా ఆమోదించబడలేదని తేల్చి చెప్పింది.