Ukraine Girl: ఉక్రెయిన్ అమ్మాయికి ‘ఢిల్లీవాలా’ లవ్ ప్రపోజ్.. త్వరలో పెళ్లి!
ఢిల్లీ వాసి అయిన అనుభవ్ భాసిన్ కు ఉక్రెయిన్ లోని అన్నా హోరోడెట్స్కా మధ్య లవ్ కుదిరింది.
- By Hashtag U Published Date - 11:33 AM, Sat - 26 March 22

ప్రేమకు భయం లేదు
ప్రేమకు ధైర్యం ఎక్కువ
ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది
ప్రేమే జీవితం.. ప్రేమే శాశ్వతం..
సరిగ్గా ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నట్టున్నారు ఇద్దరు ప్రేమికులు. అందుకే ఉక్రెయిన్ యుద్ధం కూడా వారి ప్రేమను ఆపలేకపోయింది. సరిహద్దులు దాటి.. భారత్ చేరి మరీ గెలిచింది ఆ ప్రేమ. ఢిల్లీ వాసి అయిన అనుభవ్ భాసిన్ కు ఉక్రెయిన్ లోని అన్నా హోరోడెట్స్కా మధ్య లవ్ కుదిరింది. కానీ వీరి లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. చివరకు యుద్ధం కూడా వీరి లవ్ ని ఏమీ చేయలేకపోయింది. రణరంగం నుంచి బయటకు వచ్చి మన దేశానికి చేరుకుంది అన్నా. అసలు వీరి ప్రేమ కథ ఎలా మొదలైందో తెలుసా?
రెండున్నరేళ్ల కిందటి పరిచయం ఈ ప్రేమికులది. అప్పట్లో ఆమె ఓ ఐటీ కంపెనీలో పనిచేసేది. 2020లో మన దేశానికి వచ్చినప్పుడు లాక్ డౌన్ వల్ల విమానాలు రద్దయ్యాయి. దీంతో వేరే దారిలేక ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడు అనుభవ్ ఫ్యామిలీతోనే కలిసుంది. అలా లాక్ డౌన్ ముగిసేవరకు వారితోనే ఉంది. తరువాత మళ్లీ దుబాయ్ లో ఓసారి కలుసుకున్నారు. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టింది. అలా ఇద్దరూ ఒకరి దేశానికి మరొకరు రాకపోకలు సాగించారు. కిందటి ఏడాది డిసెంబర్ లో మన దేశానికి వచ్చిన అన్నా.. అనుభవ్ ఫ్యామిలీని మళ్లీ కలిసింది. ఈ జంట అందరికీ నచ్చడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత ఆమె ఉక్రెయిన్ కు వెళ్లిపోయింది. తరువాత వీరిద్దరూ మళ్లీ కలుసుకునేలోపే యుద్ధం వచ్చింది.
ఉక్రెయిన్ లో బాంబుల వర్షం కురుస్తున్నా సరే.. బాంబ్ షెల్టర్ లో తలదాచుకుని.. అక్కడి నుంచి రైలు మార్గంలో పోలాండ్ కు చేరుకుని అక్కడి నుంచి మనదేశానికి వచ్చింది. ఆమె అలా ఢిల్లీకి చేరేలా అనుభవ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మొత్తానికి తన ప్రాణానికి ప్రాణమైన ప్రేయసిని చూడగానే అతడి ప్రాణం లేచొచ్చింది. అందుకే వెంటనే విమానాశ్రయంలోనే అన్నాకు ప్రపోజ్ చేసేశాడు. ఇది కాస్తా నెట్టింట వైరల్ అయ్యింది. పోలాండ్ లో రాయబార కార్యాలయంలో తీసుకున్న వీసా వల్ల ఆమె ఏడాది పాటు మన దేశంలోనే ఉండొచ్చు. ఈలోపు మన దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేస్తానన్నాడు అనుభవ్. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. మొత్తానికి ప్రేమకు ఓటమి లేదు… గెలుపు తప్ప అని వీరిద్దరి ప్రేమ మరోసారి లోకానికి చాటిచెప్పినట్టయ్యింది.