KGF Rocky Bhai:రాకీ భాయ్ సుత్తె .. హైదరాబాద్ లో తాజా హత్యల ఆయుధం !!
కేజీఎఫ్ -2 సినిమా చూశారా ? అందులో రాకీ భాయ్ తన ప్రత్యర్థులపై సుత్తె తో దాడులకు పాల్పడుతాడు.
- By Hashtag U Published Date - 04:30 PM, Sun - 15 May 22

కేజీఎఫ్ -2 సినిమా చూశారా ? అందులో రాకీ భాయ్ తన ప్రత్యర్థులపై సుత్తె తో దాడులకు పాల్పడుతాడు. ఈ మూవీ విడుదలైన మూడు వారాల తర్వాత.. మే నెల మొదటివారంలో హైదరాబాద్ పరిధిలోని అబ్దుల్లా పూర్ మెట్ , మీరు పెట్ లలో రెండు హత్యలు జరిగాయి. ఈ రెండు మర్డర్లలోనూ హంతకులు ప్రధాన ఆయుధంగా సుత్తెను వాడారు.
అబ్దుల్లా పూర్ మెట్ లో జరిగిన జంట హత్య కేసులోనూ ప్రధాన అనుమానితుడు కె. శ్రీనివాసరావు సుత్తెను వాడాడు. తన భార్యను, ఆమెతో వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్న యువకుడిని ఒకేచోట గుర్తించి.. సుత్తెతో కె. శ్రీనివాసరావు పాశవిక దాడి చేసి చంపాడు. మీర్ పేట ఘటనలో.. బి.శ్వేతా రెడ్డి అనే మహిళ స్నేహితులు కె.అశోక్, కె.కార్తీక్ లతో కలిసి తనతో వివాహేతర సంబంధం నెరుపుతున్న ఎం.యష్మ కుమార్ ను హత్య చేసింది. ఇందుకోసం కూడా సుత్తెనే వాడింది. వీళ్లందరూ కేజీఎఫ్ -2 సినిమాను చూసి, స్ఫూర్తి పొంది.. ఈవిధంగా హత్యలు చేశారా ?
అనే కోణంలోనూ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. నిర్దిష్టంగా కేజీఎఫ్ -2 సినిమా వల్ల వాళ్లు ప్రభావితులు కాకపోయినప్పటికీ ..ఇటీవలకాలంలో విడుదలైన మరిన్ని సినిమాలు, సీరియళ్ల ప్రభావం కూడా వారిపై పడి ఉండొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. మనిషి మెదడు మంచి కంటే చెడును త్వరగా గ్రహిస్తుందని.. ఈక్రమంలోనే ఆయా కేసుల్లో నిందితులు సినిమాలు, సీరియళ్లు స్పూర్తితో సుత్తె ను వాడి ఉండొచ్చని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా ,ఈ కేసుల నిందితులు కూడా పోలీసుల విచారణ క్రమంలో తాము కేజీఎఫ్-2 ను చూసి స్ఫూర్తి పొందామని చెప్పలేదు.