HMPV Virus : చైనాను వణికిస్తున్నకొత్త వైరస్..మళ్లీ లాక్ డౌన్ తప్పదా..?
HMPV Virus in China : శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) కేసులు చైనాలో వేగంగా పెరుగుతున్నాయి
- By Sudheer Published Date - 04:19 PM, Fri - 3 January 25

ఐదేళ్ల తర్వాత కరోనా (Corona ) లాంటి మరో మహమ్మారి చైనా(China)ను వణికిస్తుండడం ఇప్పుడు ప్రపంచ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) కేసులు చైనాలో వేగంగా పెరుగుతున్నాయి. 2019 డిసెంబర్ 31న చైనాలో కరోనా తొలి కేసును గుర్తించగా ఊహించని విధంగా 3 నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రభుత్వాలు అలర్ట్ అవ్వాలని, లేకపోతే మళ్లీ లాక్డౌన్ రోజులు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనాలో శీతాకాలం ప్రారంభంతోనే శ్వాసకోశ వ్యాధులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (HMPV) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది కరోనా మహమ్మారి ప్రారంభానికి ఐదేళ్ల తర్వాత చైనా ఎదుర్కొంటున్న మరో సవాలు. హాస్పటల్స్ తో పాటు స్మశాన వాటికలు విపరీతంగా రద్దీగా కనిపిస్తుండడం సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Aparna Malladi : కాన్సర్ తో తెలుగు డైరెక్టర్ కన్నుమూత
HMPV తో పాటు ఇన్‌ఫ్లూయెంజా A, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్-19 వంటి పలు వైరస్‌లు ఒకేసారి వ్యాపిస్తున్నట్లు సమాచారం. ఇది చైనా ప్రజలనే కాదు మిగతా దేశాల ప్రజలను సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు హాస్పటల్ పాలవుతున్నారు. ఊపిరితిత్తుల నొప్పి, “వైట్ లంగ్” కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో కూడా చైనా ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి ఎలాంటి అధికారిక అత్యవసర ప్రకటనలు లేవు. అయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైనా ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. HMPV వంటి వ్యాధులను నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం కొత్తగా న్యుమోనియా పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలపై కట్టడి చేయాలని ఉద్దేశిస్తున్నారు. 2019లో కరోనా వైరస్ విజృంభణను ఎదుర్కొనడంలో విఫలమైన చైనా, ఈసారి ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
HMPV ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులను ప్రభావితం చేస్తోంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలు, గతంలో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న పెద్దవారికి ఈ వైరస్ సోకుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ప్రారంభమవుతుండటంతో దీన్ని సాధారణ జలుబుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తుంది.
HMPV లక్షణాలు :
HMPV ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది శీతాకాలం, వసంతకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ జలుబు లాంటి లక్షణాలనుండి తీవ్రమైన న్యుమోనియా వరకు ఈ వైరస్ ప్రభావం చూపుతుంది. దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు తీవ్రస్థాయికి చేరుకుంటే ఆసుపత్రిలో చికిత్స అవసరం.
AP Metro Rail: ఏపీకి డబల్ డెక్కర్ మెట్రో రైల్…
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఈ వైరస్ ఎక్కువగా శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడగడం, శరీర సంబంధాలు తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. HMPV కి వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రస్తుతానికి సరైన చికిత్స లభ్యం కాని పరిస్థితి.
ప్రపంచానికి హెచ్చరిక :
చైనాలో ఈ వైరస్ ఉద్ధృతి ప్రపంచానికి మరో హెచ్చరిక. వైరస్‌లు ఒక దేశంలో మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాలకు వ్యాపించగలవు. 2019లో కరోనా మహమ్మారి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, దేశాలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మళ్లీ లాక్డౌన్ రోజులు, ఆర్థిక సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.