Formula E Case : ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్‌ఎన్ రెడ్డి
హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ. 45.75 కోట్లపై ఏసీబీ ప్రశ్నిస్తోంది. అలాగే ఫెనాల్టీ కింద ఐటీ శాఖకు చెల్లించిన రూ. 8 కోట్లపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
- By Latha Suma Published Date - 12:06 PM, Fri - 10 January 25

Formula E Case : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో A-3 గా ఉన్న హెచ్‌ఎండీ మాజీ చీఫ్ బీఎల్‌ఎన్ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ బోర్డు ఖాతా నుండి నగదు రిలీజ్ చేయడంలో బీఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎఫ్ఈఓకు జరిగిన చెల్లింపులపై బీఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు. అయితే ఎవరి ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తి చేసి నగదు రిలీజ్ చేశారని ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ. 45.75 కోట్లపై ఏసీబీ ప్రశ్నిస్తోంది. అలాగే ఫెనాల్టీ కింద ఐటీ శాఖకు చెల్లించిన రూ. 8 కోట్లపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. బీఎల్‌ఎన్ రెడ్డి చేసిన ప్రొసీడింగ్స్ పత్రాలను ముందు పెట్టి మరీ ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.
ఇదే కేసులో ఈడీ అధికారులు రెండ్రోజుల క్రితం బీఎల్‌ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. సుమారు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫార్ములా ఈ-కార్ రేస్ అగ్రిమెంట్ జరిగిన విధి విధానాలతో పాటు రేస్ నిర్వహణ కోసం రోడ్ల మరమ్మతులు, ఇతర కార్యక్రమాలకు హెచ్‌ఎండీ ఎంత ఖర్చు చేసిందనే కోణంలో బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించారు. ఈ కేసులో బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉండగా… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ లను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేటీఆర్ నిన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆరున్నర గంటల సేపు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
కాగా.. హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి రూ.55 కోట్లు రిలీజ్ చేయడంలో బీఎన్‌ఎల్ రెడ్డి పాత్ర చాలా కీలకమని ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా బీఎన్‌ఎల్ రెడ్డి పూర్తి చేయడంతో హెచ్‌ఎండీఏ నిధులు రిలీజ్ అయి ఎఫ్‌ఈవో కంపెనీకి చెల్లింపులు జరిగాయి. వీటిపైన పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే బీఎన్‌ఎల్ రెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈడీ విచారణ అనంతరం ఈరోజు వ్యక్తిగతంగా ఏసీబీ కార్యాలయం ముందు విచారణకు బీఎన్‌ఎల్ రెడ్డి హాజరయ్యారు. ఎఫ్‌ఈవోతో చేసిన ఒప్పందాలు, హెచ్‌ఎండీఏ నుంచి బదిలీ అయిన నగదు గురించి సుదీర్ఘంగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Hyderabad: వరదలు లేని నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్