Secretariat : సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు
Secretariat : ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అది అమలు అయ్యేవరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
- By Latha Suma Published Date - 02:51 PM, Fri - 25 October 24

Battalion Constables : తెలంగాణ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న బెటాలియన్ పోలీస్ కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌కు వ్యాపించాయి. దీంతో ఈరోజు రాష్ట్రంలో కానిస్టేబుళ్ల భార్యలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు కానిస్టేబుల్ భార్యలు సచివాలయాన్ని ముట్టడించారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అది అమలు అయ్యేవరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రిక్రూట్‌మెంట్ విధానంలో ప్రత్యేక బలగాలుగా కొంతమంది ఉద్యోగులను తీసుకుంటారని… బెటాలియన్ల ఉద్యోగాలు చేయడం వల్ల తమవారు కుటుంబాలకు దూరమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్ల భార్యలు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా బందోబస్తు పెంచారు.
కాగా, అందరి పోలీసుల్లాగే తమ భర్తలు కూడా పరీక్షలు రాసి, ఫిజికల్ టెస్టుల్లో పాసై, 9 నెలలు కఠోర శిక్షణ తీసుకున్నవారేగా? వాళ్లకెందుకు మిగతా సివిల్, ఏఆర్ పోలీసుల్లాగా ఒకే చోట డ్యూటీలు వేయరు? వాళ్లను కట్టుకున్న పాపానికి మేమేం తప్పు చేశాం? అంటూ బాధిత బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ‘మా భర్తలు ఏడాదికి మూడు జిల్లాలు తిరగాల్సి వస్తుంది. మేము ఎక్కడ ఉండాలి? మా బిడ్డలు ఎక్కడ చదువుకోవాలి? చేసేది పోలీసు ఉద్యోగమైనా ఈ తిరుగుడేంది?’ అని ప్రశ్నిస్తున్నారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న తమ భర్తలను తోటి పోలీసులే జీతగాండ్లలాగా చూస్తున్నారని.. పొద్దున్నే పలుగు, పారలతో గడ్డి పీకిస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్రంలో సివిల్, ఏఆర్ పోలీసుల మాదిరిగానే బెటాలియన్ పోలీసులకు వారు కోరుకున్న జిల్లాలో కనీసం 3-5 ఏండ్లు ఒకే చోట పనిచేసే వెసులుబాటు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల పిల్లల చదువులకు అంతరాయం లేకుండా ఉంటుందని, ఉద్యోగభారం తగ్గుతుందని చెబుతున్నారు.
Read Also: Delhi : తీవ్ర వాయు కాలుష్యం..కేంద్రం కీలక సూచనలు..