Vamsi Bail Petition : హైకోర్టులో వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి.. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో కూడా వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు.
- Author : Latha Suma
Date : 20-02-2025 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
Vamsi Bail Petition : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. బెయిల్ కోసం విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టును ఆశ్రయించాలని వంశీకి సూచించింది. ఇదిలా ఉంటే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి.. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో కూడా వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు.
Read Also:CM Chandrababu : ఏపీలో ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం..
కాగా, వైసీపీ నేత వల్లభనేని వంశీ కిడ్నాప్, దాడి కేసులో వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలన్నీ పక్కాగా తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రాయదుర్గంలో వంశీ నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజీని సేకరించారు. ఇందులో పలు కీలక ఆధారాలు లభించాయి. సత్యవర్ధన్‌ను విశాఖకు తీసుకెళ్లి తొలుత చేబ్రోలు శ్రీనుకు చెందిన ఫ్లాట్‌లో ఉంచారు. అనంతరం హోటల్‌కు తరలించారు. ఈ రెండుచోట్లా సీసీ కెమెరాల్లో వంశీ అనుచరులు సత్యవర్ధన్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. వీటిని విజయవాడ నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది.
మరోవైపు వల్లభనేని వంశీని సత్యవర్ధన్ కేసులో పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ విచారణ చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్.. వల్లభనేని వంశీని కస్టడీలో ప్రశ్నించడంతో పాటుగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. కిడ్నాప్ కేసులో 11 మంది నిందితులు ఉన్నారని.. వారిలో ఐదుగురు మాత్రమే అరెస్ట్ అయ్యారన్నారు. అలాగే మరో ఆరుగురిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అయితే వంశీ తరపు లాయర్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ అవసరం లేదని కోర్టులో వాదనలు వినిపించారు. సత్యవర్ధన్ పోలీసుల కస్టడీలోనే ఉన్నారని.. అతడ్నిప్రశ్నిస్తే సరిపోతుందన్నారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను గురువారానికి కోర్టు వాయిదా వేసింది.