America : భారత వలసదారుల తరలింపు పై అమెరికా స్పందన..
తమ దేశం , ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని, అది తమ విధానమని పేర్కొంది.
- By Latha Suma Published Date - 08:13 PM, Thu - 6 February 25

America : తమ దేశంలో అక్రమంగా ఉంటున్న భారత వలసదారులను వెనక్కి పంపడంపై అమెరికా స్పందించింది. తమ దేశం , ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని, అది తమ విధానమని పేర్కొంది. ఆ విమాన ప్రయాణం గురించి ఇంతకు మించి ఏం చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు భారత్ లోని యూఎస్ దౌత్య కార్యాలయ ప్రతినిధి మాట్లాడారు. భారత్‌కు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా నుంచి బయలుదేరిన సైనిక విమానం బుధవారం అమృత్‌సర్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
Read Also: Kohli Injury: గాయం కారణంగా కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్ మిస్
నిన్న మధ్యాహ్నం శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానం దిగింది. ఇందులో హరియాణా, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్.. తదితర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. కాగా, ఈ తరలింపు వేళ వలసదారులతో అమానవీయంగా ప్రవర్తించారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ తరుణంలో విదేశాంగమంత్రి జై శంకర్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. తరలింపు ప్రక్రియ కొత్తదేమీ కాదని అన్నారు.
ఏళ్ల నుంచి అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదన్నారు. అన్నిదేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోంది. 2012లో ఈ సంఖ్య 530గా ఉండగా.. 2019లో 2వేలకు పైగా ఉంది. అక్రమ వలసలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలి. తమ దేశస్థులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం ఆయా దేశాల బాధ్యత అని జైశంకర్ స్పష్టం తెలిపారు.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్నారు. అక్రమ వలసదారులను గుర్తించి ఎవరి దేశం వారిని పంపిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్ కు చెందిన వారిని తిప్పి పంపింది. వీరంతా అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని అక్కడి అధికారులు తెలిపారు. అందుకే వారిని తిప్పి వారి వారి దేశాలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. తమ దేశం, ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని తెలిపారు.