Pond Stolen : ఏకంగా చెరువునే దొంగిలించారు.. ఎలా ?
Pond Stolen : గతంలో ఒక వంతెనను దొంగతనం చేసుకుపోయారు.. ఒక రైలు ఇంజిన్‌ను దొంగతనం చేసుకుపోయారు..
- By Pasha Published Date - 09:42 AM, Mon - 1 January 24

Pond Stolen : గతంలో ఒక వంతెనను దొంగతనం చేసుకుపోయారు.. ఒక రైలు ఇంజిన్‌ను దొంగతనం చేసుకుపోయారు.. ఈజాబితా ఇప్పుడు మరింత పెరిగింది. తాజాగా ఒక చెరువును కూడా దొంగతనం చేసుకుపోయారట. అదెలా సాధ్యమైందని అనుకుంటున్నారా ? బిహార్‌లో జరుగుతున్న ఈ విచిత్ర దొంగతనాల చిట్టా గురించి తెలియాలంటే ఈ వార్త మొత్తం చదవాల్సిందే. దర్భంగా జిల్లాలో ల్యాండ్ మాఫియా బరితెగించింది. ఓ చోట ఏకంగా చెరువును మాయం చేసింది. దానిపై గుడిసెను కూడా నిర్మించుకుంది. దీంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి ల్యాండ్ మాఫియాలోని వ్యక్తులు పరారయ్యారు. గతంలో ఈ చెరువులో చేపల పెంపకం చేసి ఎంతోమంది మత్స్యకారులు ఉపాధి పొందేవారు. కానీ దర్భంగాలో పెరుగుతున్న భూముల ధరల కారణంగా ల్యాండ్ మాఫియా కన్ను ఈ చెరువుపై పడింది.
15 రోజుల్లో ప్రతీరాత్రి..
ఈ మొత్తం చెరువును ఒకేరోజులో మట్టితో నింపలేదు. ఇందుకోసం దాదాపు 15 రోజుల పాటు ప్రతీరాత్రి ల్యాండ్ మాఫియా పనిచేసింది. రోజూ రాత్రి వచ్చి చెరువులో మట్టిని నింపి.. దాన్ని లెవలింగ్ చేశారు. దీంతో రెండువారాల తర్వాత చెరువు ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. రాత్రివేళ వర్క్స్ జరగడంతో గుర్తించలేకపోయామని స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. వాస్తవానికి ఇలాంటి పనులు స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు లేకుండా..స్థానికులకు తెలియకుండా జరగవు అనేది స్పష్టమైన అంశం. పోలీసు విచారణ కరెక్టుగా జరిగితే అసలు బండారం బయటపడుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
- గతంలోకి వెళితే.. రైలు డీజిల్ ఇంజన్ 2022 నవంబరులో దొంగతనానికి గురైంది. బిహార్‌లోని బెగుసరాయ్‌లో ఉన్న రైల్వే యార్డ్ నుంచి దీన్ని దొంగిలించారు. దొంగలు యార్డ్‌లోకి సొరంగం తవ్వి ఇంజన్‌లోని విడిభాగాలను ఒక్కటొక్కటిగా దొంగిలించారు. చివరకు ఇంజన్‌లో ఏ పార్ట్ కూడా అక్కడ మిగలలేదు.
- 2022 సంవత్సరం ప్రారంభంలో బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో 60 అడుగుల వంతెన దొంగతనానికి గురైంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారి సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 247 కిలోల ఐరన్ చానెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. జేసీబీలు, గ్యాస్ కట్టర్లను ఉపయోగించి వంతెనను కూల్చేయడంతో మూడు రోజుల్లోనే అది మాయమైంది.