Shubhanshu Shukla : అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా సందేశం..మీరంతా నా వెంటే
నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత భారతదేశం మళ్లీ అంతరిక్షాన్ని తాకింది. ఇది కేవలం నా ప్రయాణం కాదు భారత మానవ సహిత రోదసి యాత్రకు ఇది ప్రారంభ ఘట్టం. నా భుజాలపై ఉన్న త్రివర్ణ పతాకం చూస్తుంటే, మీ అందరి ఆశీస్సులు నాతో ఉన్నాయనే గర్వం కలుగుతోంది.
- By Latha Suma Published Date - 01:35 PM, Wed - 25 June 25

Shubhanshu Shukla : కోట్లాది భారతీయుల కలను సాకారం చేస్తూ, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రోదసిలో అడుగుపెట్టారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రయోగించిన ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షాన్ని చేరుకుంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా శుభాంశుతో పాటు మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులు ఈ ప్రయాణంలో ఉన్నారు. రాకెట్ ప్రయోగానికి కొన్ని నిమిషాలకే వ్యోమనౌక రాకెట్ నుంచి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ వ్యోమనౌక సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో భూ కక్ష్యలో ప్రయాణిస్తోంది. రోదసిలో తాను ఎలా ఉన్నారో, భారత పౌరులకు శుభాంశు శుక్లా మొదటి సందేశం పంపారు.
Read Also: Nara Lokesh : రెడ్‌బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు
నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత భారతదేశం మళ్లీ అంతరిక్షాన్ని తాకింది. ఇది కేవలం నా ప్రయాణం కాదు భారత మానవ సహిత రోదసి యాత్రకు ఇది ప్రారంభ ఘట్టం. నా భుజాలపై ఉన్న త్రివర్ణ పతాకం చూస్తుంటే, మీ అందరి ఆశీస్సులు నాతో ఉన్నాయనే గర్వం కలుగుతోంది. మన దేశానికి ఇది గర్వకారణమైన ఘట్టం. మనం కలిసి మన మానవ అంతరిక్ష యాత్రను ముందుకు తీసుకెళ్లాలి. జై హింద్! జై భారత్! అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు. ఈ ప్రయాణం మొత్తం 28 గంటల పాటు కొనసాగనుంది. గురువారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అనుసంధానం అవుతుంది. అక్కడ శుభాంశు శుక్లా బృందం 14 రోజుల పాటు ఉండనుంది. ఈ సమయంలో వారు భారరహిత స్థితిలో పలు శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు భారత పాఠశాల విద్యార్థులతో అంతరిక్షం నుంచి ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కూడా ఈ బృందానికి కలుగనుంది.
భారత మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో ఇది మరొక చారిత్రక అడుగు. గతంలో 1984లో రాకేశ్ శర్మ తొలి భారతీయుడిగా రోదసిని సందర్శించిన తర్వాత, 41 ఏళ్ల అనంతరం శుభాంశు శుక్లా రోదసిలో అడుగుపెట్టడం గర్వకారణం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో జరగబోయే గగనయాన్ మిషన్‌కు ఇదో మార్గదర్శక ప్రయాణంగా నిలుస్తుంది. ఈ యాత్ర ద్వారా భారత్ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించే దిశగా ముందడుగు వేసింది. శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతికత కలగలిపిన ఈ ప్రయాణం కోట్లాది భారతీయుల కలలకు అర్థం చెప్పిన ఘట్టంగా చరిత్రలో నిలిచి పోతుంది.
Read Also: Pakistan : వింగ్ కమాండర్ అభినందన్‌ను పట్టుకున్న పాకిస్తాన్ మేజర్ ముయిజ్ హత్య