Yuva Vikasam : నేడు ప్రారంభించాల్సిన ‘యువవికాసం’ వాయిదా
Yuva Vikasam : యువతలో ఆశలు రేకెత్తించిన ఈ 'యువవికాసం' పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనే దృష్టితోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది
- By Sudheer Published Date - 08:24 AM, Mon - 2 June 25

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ప్రారంభించాల్సిన ‘యువవికాసం’ (Rajiv Yuva Vikasam Scheme) పథకాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పథకం కింద యువతకు ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో, అర్హుల ఎంపిక ప్రక్రియను మరోసారి నిశితంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది.
Telangana Formation Celebrations : పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అనర్హులకు ఈ పథకం లబ్ధి అందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పెద్దఎత్తున వినతులు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు సమాచారం. దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత ఉండేలా, అర్హుల జాబితా ఖచ్చితంగా రూపొందించేందుకు అధికారులు గడువు కోరినట్లు తెలుస్తోంది. అందువల్ల పథక ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ అంశంపై జూన్ 5న జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి, అర్హుల ఎంపిక విధానం, పథకం అమలు తీరు తదితర అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. యువతలో ఆశలు రేకెత్తించిన ఈ ‘యువవికాసం’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనే దృష్టితోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాత త్వరలోనే పథకం అమలుకు తెరతీసే అవకాశం ఉంది.