DK Shivakumar: కాంగ్రెస్ నేతలకు ‘‘గడ్డం’’ సెంటిమెంట్!
కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఒక నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యేవరకు గడ్డం తీయనని ప్రకటించారు. తనకు తీహార్ జైలులో గడ్డం పెరిగిందని, ప్రజలు తనకి విజయం అందిస్తేనే గడ్డం తీసుకుంటానని తేల్చి చెప్పారు.
- Author : Siddartha Kallepelly
Date : 11-01-2022 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఒక నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యేవరకు గడ్డం తీయనని ప్రకటించారు. తనకు తీహార్ జైలులో గడ్డం పెరిగిందని, ప్రజలు తనకి విజయం అందిస్తేనే గడ్డం తీసుకుంటానని తేల్చి చెప్పారు. కావేరి నదిపై మేకేదాతు డ్యాం కట్టాలని డిమాండ్ చేస్తూ శివకుమార్ పదిరోజుల పాదయత్రకి పిలుపునిచ్చారు. కరోనా సమయంలో పాదయాత్రకు పిలుపునివ్వడంపై అక్కడి అధికారపార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాలతో ఆడుకొంటోందని విమర్శిస్తోంది. కర్ణాటకలో అమలవుతోన్న వీకెండ్ కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించినందుకు శివకుమార్ తో పాటు మరో 30మంది పై కేసు నమోదు చేశారు. పాదయాత్రకు ప్రజలనుండి వచ్చే రెస్పాన్స్ తట్టుకోలేకే ప్రభుత్వం కేసులు పెడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
శివకుమార్ సీఎం అయ్యేదాకా గడ్డం తీయనని ప్రకటించడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణాలో 2019 ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా తాను గడ్డం తీయనని ప్రకటించగా కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. ఇక కర్నాటకలో కూడా సేమ్ రిపీట్ అవుతుందా? చరిత్ర సృష్టిస్తుందా చూడాలి. గతంలో టీకాంగ్రెస్ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కూడా గడ్డం పెంచిన విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ను గద్దె దించేవరకూ తాను గడ్డం తీసేదే లేదని అప్పట్లో ఉత్తమ్ కుమార్ తేల్చి చెప్పడం విశేషం. తాజాగా డికే శివకుమార్ కూడా ఇలాంటి కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ నేతలకు గడ్డం సెంటిమెంట్ గా మారిందా? అని పలువురు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.