నేడే జాతికి అంకితం : దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్ రామగుండంలో..విశేషాలివీ
ఎన్టీపీసీ రామగుండం నేడు ఒక కీలక ఘట్టానికి వేదికగా నిలువబోతోంది. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు వద్ద రిజర్వాయర్‌లో నిర్మించిన 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
- By Hashtag U Published Date - 10:52 AM, Sat - 30 July 22

ఎన్టీపీసీ రామగుండం నేడు ఒక కీలక ఘట్టానికి వేదికగా నిలువబోతోంది. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు వద్ద రిజర్వాయర్‌లో నిర్మించిన 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ పద్ధతిలో ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలోని ఈ ప్రాజెక్టుతో పాటు కేరళలోని కాయంకుళం లో 92.5 మెగావాట్ల సోలార్ కేంద్రాన్ని కూడా ప్రధాని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఇంతకీ ఏమిటీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
500 ఎకరాలలో.. రూ.423 కోట్లతో
పెద్దపల్లి జిల్లా రామగుండం వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ రిజర్వాయర్‌లో దాదాపు 500 ఎకరాలలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మించారు. రెండేళ్ల వ్యవధిలో దీన్ని నిర్మించారు. ఈ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 100 మెగావాట్లు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్లాంట్ పర్యావరణానికి అనుకూలమైంది. దీని నిర్మాణానికి రూ.423 కోట్లు ఖర్చు అయింది.
ప్లాంట్ పనితీరు
సోలార్ ఫోటో వోల్టాయిక్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ ప్రాజెక్టులో 4.5 లక్షల సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఈ ప్లాంట్ లో 40 బ్లాకులు ఉంటాయి. ఒక్కో బ్లాక్ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 2.5 మెగావాట్లు. ఈ లెక్కన మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 100మెగా వాట్లు. ఈ ప్లాంట్ వల్ల ఏడాదికి సుమారు 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరిని నివారించవచ్చని అంటున్నారు.
నిర్మాణం.. ఎంతో ఈజీ
నీటి వనరులు, భారీ జలాశయాలపై తేలియాడే సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి ఖర్చులను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫ్లోటింగ్ సోలార్ యూనిట్లు.. గ్రౌండ్-మౌంటెడ్ ప్లాంట్‌లతో పోల్చినప్పుడు తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడుకున్నవని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రధాన జలాశయాలు ఉన్నందున.. ఇక్కడ తేలియాడే సౌర ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని NTPC యోచిస్తోంది. భూమిపై ఒక మెగావాట్ల సోలార్ ఫోటో-వోల్టాయిక్ ప్లాంట్ ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమి అవసరం. ఈ భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకోవడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. ఈ తేలియాడే సోలార్ ప్లాంట్లను రిజర్వాయర్ లపై ప్రభుత్వమే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉచితంగా ఏర్పాటు చేసుకోవచ్చు. కాగా, విశాఖపట్నంలోని సింహాద్రి విద్యుత్ ప్లాంట్లో 25 మెగావాట్ల యూనిట్ ను కూడా NTPC ఏర్పాటు చేస్తోంది.
తెలంగాణలోని 6 వేల చెరువులు అనుకూలం..
రామగుండంలో తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుతో తెలంగాణలో మొత్తం పునరుత్పాదక ఇంధన వాటా సామర్థ్యం 3944 మెగావాట్లకు చేరుతుంది. రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో కనీసం 5 నుంచి 6 వేల చెరువులు ఫ్లోటింగ్ ప్లాంట్లకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలు అమలైతే తెలంగాణ ఖ్యాతి ప్రపంచదేశాల్లో మారుమోగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సర్కారు దీనిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి లభ్యత, అలల తీవ్రత, విస్తీర్ణం, డెడ్స్టోరేజి, సమీపంలో ఉన్న సబ్స్టేషన్ వివరాలు, పరిసర గ్రామాలలో విద్యుత్ డిమాండ్, ఇతరత్రా సమాచారాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ , నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో..
సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువగా మహబూబ్‌నగర్ , నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో అవకాశం ఉంది. మిగతా చోట్ల కంటే ఈ ప్రాంతాల్లో ఎండ వేడి అధికంగా ఉంటుంది. ఫలితంగా ఎక్కువ సోలార్ ప్లాంట్లు ఈ ప్రాంతంలోనే ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తం గా సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు టెండర్లు పిలిచింది. ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న టైమ్‌లో యూనిట్‌కు రూ.6.49 చొప్పున టెండర్లు పిలవగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక రెండు సార్లు టెండర్లు పిలిచారు. ఆశావహుల నుంచి స్పందన బాగానే ఉన్నా, స్థలం కొరత కారణంగా ప్లాంట్ల నిర్మాణం లో ఆశించిన వేగం కనిపించ లేదు.
600 మెగావాట్ల సౌర శక్తి ప్రాజెక్టు
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ 600 మెగావాట్ల సౌర శక్తి ప్రాజెక్టు భారతదేశంలో రాబోతోంది. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలోని నర్మదా నదిపై ఓంకరేశ్వర్ ఆనకట్ట వద్ద నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2022-23 నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. ఆనకట్టలో సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 2 వేల హెక్టార్ల నీటి ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. జలాశయంలోని నీటి ఉపరితలంపై ఈ సౌర ఫలకాలు తేలుతాయి.