vijayashanthi : ఎమ్మెల్సీగా రాములమ్మ ప్రమాణం..నెక్స్ట్ ఏంటి?
vijayashanthi : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ఆమెతోపాటు మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. విజయశాంతి ప్రమాణ సమయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
- By Sudheer Published Date - 02:48 PM, Mon - 7 April 25

తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపు తిరిగింది. ప్రముఖ సినీ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి (vijayashanthi ) తాజాగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ(MLC)గా ప్రమాణం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ఆమెతోపాటు మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. విజయశాంతి ప్రమాణ సమయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాములమ్మగా ప్రజల్లో పేరుగాంచిన విజయశాంతి, ప్రస్తుతం రాజకీయంగానూ తన స్థానం సంపాదించేందుకు మరో అడుగు వేసినట్టయ్యింది.
విజయశాంతి రాజకీయ ప్రయాణం ఎంతో రసపదంగా సాగింది. తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్ తరఫున ఆమె కీలకంగా వ్యవహరించారు. కానీ పార్టీలో అంతరాలు పెరగడంతో అనంతరం బీజేపీ, ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి ఆహ్వానంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చొరవగా కొనసాగుతున్నారు. గతంలో ఆమెను ఎవరూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఊహించకపోయినా, అధిష్ఠానం అనూహ్యంగా ఆమెకు అవకాశం కల్పించింది. దీంతో రాములమ్మకు పార్టీ అధిష్ఠానం వద్ద మంచి పాజిటివ్ ఇమేజ్ ఉందని చెప్పొచ్చు.
ఇప్పుడు కేబినెట్ విస్తరణ నేపథ్యంలో విజయశాంతి భవిష్యత్తుపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్‌లో ఖాళీగా ఉన్న 6 పదవుల్లో కనీసం నాలుగు భర్తీ చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రక్రియలో రాములమ్మకు అవకాశం కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ మద్దతుతో పాటు పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా విజయశాంతిపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి రాములమ్మకి మంత్రిత్వ పదవి లభిస్తుందా? లేదా? అన్నది త్వరలోనే తేలనుంది.