Uppal MLA : కాంగ్రెస్ లోకి మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే..?
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది
- Author : Sudheer
Date : 21-06-2024 - 3:50 IST
Published By : Hashtagu Telugu Desk
బిఆర్ఎస్ (BRS) లో ఉన్న కొద్దీ మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్(Congress) ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు..తర్వాత ఎలా అయితే వరుసపెట్టి ఆ పార్టీ నేతలను తమ పార్టీ లోకి జాయిన్ చేసుకుందో..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా అదే విధంగా జాయిన్ చేసుకుంటుంది. ఈరోజు మాజీ స్పీకర్ , సీనియర్ బిఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) కి వెళ్లి మరి సీఎం రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు. పోచారం వంటి సీనియర్ నేత కాంగ్రెస్ లో చేరడం బిఆర్ఎస్ శ్రేణులు తట్టుకోలేకపోయారు. సీఎం..పోచారం ఇంట్లో ఉండగానే పోచారం నివాసం వద్దకు వెళ్లి ఆందోళనలు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక మాజీ మంత్రి హరీష్ సైతం..కాంగ్రెస్ ధోరణి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. బిఆర్ఎస్ నేతలను భయపెట్టి కాంగ్రెస్ లోకి లొంగదీసుకుంటున్నారని మండిపడ్డారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిశామని, పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరడంతో.. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతామని, రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామని సీఎం స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగానే మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (uppal mla bandari lakshma reddy ) తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలొస్తున్నాయి. అయితే నిన్న జానారెడ్డి పుట్టినరోజు కావడంతో విషెస్ చెప్పడానికే లక్ష్మారెడ్డి వెళ్లారని బిఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. మరి వీరు చెప్పేది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
Read Also : Nara Lokesh : అసెంబ్లీ లో లోకేష్ ప్రమాణం పై వైసీపీ సెటైర్లు