PK and TRS Strategy: 21 ఏళ్ల టీఆర్ఎస్ కు ఆ వయసువారే టార్గెట్టా? పీకే ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఏమిటి?
18 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న వారిని తిరిగి టీఆర్ఎస్ వైపు ఆకర్షించేలా చేయడానికి ఐప్యాక్ తో జట్టు కట్టింది టీఆర్ఎస్.
- By Hashtag U Published Date - 09:15 AM, Wed - 27 April 22

18 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న వారిని తిరిగి టీఆర్ఎస్ వైపు ఆకర్షించేలా చేయడానికి ఐప్యాక్ తో జట్టు కట్టింది టీఆర్ఎస్. పీకే టీమ్ ఇచ్చిన ఇన్ పుట్ ను, తమ టీమ్ అమలు చేస్తే.. విజయం తథ్యమని కేసీఆర్ భావిస్తున్నట్టే కనిపిస్తోంది. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీనివల్ల ఆ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగాయి. అయితే 2019 జనవరి నాటికి దాదాపు 20 లక్షల మంది యువత కొత్తగా ఓటు హక్కును పొందారు. అంటే 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరమైన ఈ యువత.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటు హక్కును పొందింది. దీంతో వారి ఓట్లను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఖాతాలో వేసుకున్నాయి. అందువల్లే వారు కొన్ని స్థానాలను గెలుచుకోగలిగినట్లు కేసీఆర్ విశ్లేషణలో తేలింది. ఐప్యాక్ ఇన్ పుట్ కూడా ఇదే చెప్పింది. అందుకే ఆ యువతను ఆకట్టుకునేలా కొత్త స్కెచ్ ను తయారుచేశారు.
2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన సమయానికి పదేళ్ల వయసున్న పిల్లలకు 2023 నాటికి 19 ఏళ్ల వయసు వస్తుంది. అంటే వారికి ఓటు హక్కు వచ్చినట్లే. సో అలాంటి కొత్త ఓటర్లకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, అందులో కేసీఆర్ పాత్ర.. టీఆర్ఎస్ పోరాడిన తీరు.. ఇవన్నీ తెలియజెప్పాల్సిన అవసరముంది. ఆ పనిని చేపట్టేలా ఐప్యాక్ సేవలు తీసుకోవాలనుకున్నారు కేసీఆర్.
టీఆర్ఎస్ అధినేత కులమతాల గురించి మాట్లాడడానికి కారణాలు లేకపోలేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండడం వల్లే కమలం గెలుపు సాధ్యమైంది. ఆ మాటను ఆ పార్టీ నాయకులే చెప్పారు. అంటే.. కమలనాథుల సోషల్ మీడియా స్ట్రాటజీని ఎదుర్కోవాలంటే ఆ స్థాయిలో సేవలు అందించే ఐప్యాక్ సేవలు తప్పనిసరి అని కేసీఆర్ భావించినట్లుంది.
భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్నా, కొత్త కూటమి ఏర్పాటు చేయాలన్నా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలతో విస్తృత పరిచయాలనున్న ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకుంటే లాభమనుకున్నారు. అందుకే ఆయన సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఒకవేళ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లినా 10 నెలల ముందు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.