Talasani Brothers: ఈడీ ముందుకు మంత్రి తలసాని బ్రదర్స్!
తెలంగాణలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, వద్దిరాజుల నివాసాల్లో
- By Balu J Published Date - 02:58 PM, Wed - 16 November 22

తెలంగాణలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, వద్దిరాజుల నివాసాల్లో ఈడీ సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. తలసాని మహేష్, ధర్మేందర్ యాదవ్‌ను ఈడీ విచారిస్తోంది. క్యాసినో, హవాలా కేసులో ఆరోపణలపై ఇరువురిని ఈడీ ప్రశ్నిస్తోంది. మనీలాండరింగ్ వ్యవహారంపైనా విచారణ జరుగుతోంది. గడిచిన నాలుగేళ్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ చేస్తోందని తెలుస్తోంది.
ఈ అంశం టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఈ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న ప్రగతి భవన్ లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, మంత్రులు వివాదాలకు పోకూడదని, జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తలసాని సోదరులు ఈడీ ముందుకు హాజరుకావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకింత ఆందోళన నెలకొంది.
తలసాని మహేష్, ధర్మేందర్ యాదవ్‌లకు ఈడీ నోటీసులు వచ్చినట్లుగా ఇప్పటి వరకూ బయటకు తెలియదు. వారు విచారణకు హాజరైన తర్వాతనే తెలిపింది. మొత్తంగా వారి వ్యాపారాలకు సంబంధించిన నాలుగేళ్ల ఆర్థిక లావాదేవీలను తీసుకుని రావాలని ఈడీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే వీరి వ్యాపారాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు భాగస్వామ్యం ఉందో లేదో స్పష్టత లేదు. మంత్రికి మాత్రం ఈడీ నోటీసులు జారీ కాకపోవడంతో.. ఆయన సోదరుల వ్యవహారంలోనే ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు.