TPCC Mahesh Goud : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేస్తున్నాం.. గెలుస్తున్నాం..
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలను విశ్వసించరాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
- By Kavya Krishna Published Date - 04:59 PM, Wed - 25 June 25

TPCC Mahesh Goud : బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మవద్దని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది గత ఏ ప్రభుత్వ హయాంలోనూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల ప్రయోజనాల కోసమే పథకాలను ప్రవేశపెట్టిందని ఆరోపించిన మహేశ్ గౌడ్, హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో హడావుడిగా తీసుకువచ్చిన దళితబంధు దానికి పెద్ద ఉదాహరణ అని గుర్తుచేశారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తోందని తెలిపారు. ఇందుకు భయపడ్డ బీఆర్ఎస్ పార్టీ, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలతో దుష్ప్రచార యత్నాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేస్తున్నాం.. గెలుస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
కేవలం పదేళ్లు పాలనలో ఉన్న బీఆర్ఎస్ కంటే, కేవలం 18 నెలల కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం చాలా అభివృద్ధి సాధించిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలకు బాగా తెలుసన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టిన తీరును ప్రజలు మరచిపోలేరని ఆయన వ్యాఖ్యానించారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతతో, లోతుగా అధ్యయనం చేస్తోందని మహేశ్ గౌడ్ తెలిపారు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ప్రజలతో నిత్యం వాస్తవాలను పంచుకోవాలని, బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారానికి ప్రతిస్పందనగా నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Shubhanshu Shukla : శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం..నింగిలోకి ఫాల్కన్ -9 రాకెట్