Revanth Reddy@LB Nagar: రేవంత్ రెడ్డి చూపు.. ఎల్ బీ నగర్ వైపు?
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీడీపీ టికెట్ పైనే గెలిచారు రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన
- By Balu J Published Date - 09:36 PM, Sat - 24 September 22

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీడీపీ టికెట్ పైనే గెలిచారు రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తూ, అసెంబ్లీలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. అయితే తెలంగాణలో రాజకీయ చిత్రం మారిపోవడంతో అనేక మంది పార్టీలు మారారు. రేవంత్ చాలా కాలం వెయిట్ చేసి 2017లో కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొడంగల్ నుంచి పోటీచేయగా.. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు పూర్తిగా చెక్ పెట్టింది.
కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహం రచించి మరీ ఆయనను ఓడగొట్టింది. పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందినా.. రేవంత్‌ను ఓడగొట్టే క్రమంలో అన్న పట్నం మహేందర్ రెడ్డి తాండూర్ నుంచి ఓడిపోయారు. అయితే ఆ తర్వా త పట్నం బ్రదర్స్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలపై పట్టు సాధించారు. ఓడిపోయిన రేవంత్ రెడ్డి కసితో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. అయితే, రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాబట్టి ఆయన సీఎం రేసులో ఉంటారు. సీఎం కావాలంటే తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుపొందాలి. ఓడినా సరే ఎమ్మెల్సీగా గెలిచి సీఎం అయిపోతాను అనే మాటలు తెలంగాణ కాంగ్రెస్‌లో చెల్లవు. అందుకే రాబోయే ఎన్నికల్లో తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై రేవంత్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొడంగల్ రేవంత్‌కు చాలా సేఫ్ సెగ్మెంట్.
అయితే గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక వ్యూహం రచించి మరీ ఓడిపోయేలా చేశారు. తన కంచుకోట అనుకున్న సెగ్మెంట్‌లోనే ఓడిపోవడం రేవంత్‌కు భారీ అవమానాన్ని మిగిల్చింది. ఇక ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా ఎన్నికల బరిలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ మరింత ఫోకస్ చేస్తుందని రేవంత్ భావిస్తున్నారు. కంచుకోట అనుకున్న కొడంగల్‌లోనే ఓడిస్తే ఇక ఎక్కడి నుంచి పోటీ చేయాలని దారులు వెదుకుతున్నారు. ఇటీవల తన సన్నిహితులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి సేఫ్ సెగ్మెంట్ కోసం సలహా అడిగారు. జీహెచ్ఎంసీ పరిధిలో పోటీచేస్తే గెలిచే అవకాశాలపై ఆరా తీశారు. ఇప్పటికే మల్కాజ్‌గిరి ఎంపీగా ఉండటంతో ఆ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకదాన్ని ఎంచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలో మేడ్కల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో ఎల్బీనగర్ అయితే రేవంత్ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి కూడా లేరు. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్. కృష్ణయ్య తన వ్యక్తిగత చరిష్మాతో గెలిచారు. దీంతో రేవంత్ కూడా ఈ నియోజకవర్గంపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. కొడంగల్ తనకు కంచుకోట అయినా.. గత నాలుగేళ్లుగా మల్కాజ్‌గిరి ఎంపీగా ఉండటంతో ఎల్బీనగర్ ప్రజలకు రేవంత్ గుర్తుండిపోయారు. పైగా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిచిన చరిత్ర లేదు. అందుకే ఎల్బీనగర్ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Related News

Telangana: రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నాయకుడు: కేటీఆర్ గరం
రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ నేతగా వర్ణిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తోందని,