AI Fake Call : AI వీడియో కాల్తో టోకరా… డబ్బులు పోగొట్టుకున్న టీడీపీ నేత
AI Fake Call : సత్తుపల్లి ప్రాంతంలోని టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకున్న ఒక మోసగాడు, దేవినేని ఉమ మహేశ్వరరావు వ్యక్తిగత సహాయకుడిని (PA)గా నటించాడు
- By Sudheer Published Date - 05:00 PM, Fri - 10 October 25

ఖమ్మం జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి పెద్దఎత్తున మోసం జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. సత్తుపల్లి ప్రాంతంలోని టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకున్న ఒక మోసగాడు, దేవినేని ఉమ మహేశ్వరరావు వ్యక్తిగత సహాయకుడిని (PA)గా నటించాడు. ఆ వ్యక్తి కొంతమంది నేతలకు ఫోన్ చేసి “సార్ మాట్లాడతారు” అంటూ వీడియో కాల్‌కు కనెక్ట్ చేశాడు. వీడియోలో దేవినేని ఉమ లా కనిపించిన వ్యక్తి నేతలతో మాట్లాడి, కొందరికి ఆర్థిక సహాయం అందించాలనుకుంటున్నట్టు చెప్పడంతో వారు నమ్మకం పొందారు. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ నేతలు అతని సూచన మేరకు కొంత నగదు పంపించడం జరిగింది.
Yashasvi Jaiswal : ఢిల్లీ గడ్డపై జైస్వాల్ శతకం..!
దీంతో ఆ మోసగాడు మరింత ధైర్యంగా ముందుకెళ్లి “చంద్రబాబు నాయుడు గారు కూడా మీతో భేటీ కావాలనుకుంటున్నారు, B ఫారాలు ఇవ్వాల్సి ఉంది, కాబట్టి విజయవాడకు రండి” అంటూ వారిని పిలిచాడు. సత్తుపల్లి నుంచి కొంతమంది టీడీపీ నాయకులు విజయవాడకు వెళ్లగా, అక్కడ భేటీ ఏర్పాటుకి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున ఇవ్వాలని ఆ వ్యక్తి కోరాడు. ఇంతవరకు నమ్మిన నాయకులు ఈ దశలో ఏదో తేడా ఉందని అనుమానం పుట్టి, వెంటనే దేవినేని ఉమను నేరుగా సంప్రదించారు. ఉమ మహేశ్వరరావు ఆ విషయం పూర్తిగా ఫేక్ కాల్ అని, తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని స్పష్టం చేశారు.
ఈ సంఘటనతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. AI టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ వీడియో కాల్స్, ఫేక్ వాయిస్ క్లిప్స్ ద్వారా మోసగాళ్లు ఇప్పుడు కొత్త పంథాలో మోసాలు చేస్తుండటం గమనార్హం. దేవినేని ఉమ ఈ ఘటనపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. సైబర్ క్రైమ్ విభాగం కూడా ఈ మోసగాడి లొకేషన్ ట్రేస్ చేయడం ప్రారంభించింది. రాజకీయ నేతల పేర్లను, ఫోటోలు, వాయిస్ నమూనాలను ఉపయోగించి ఇలా మోసాలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాలి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన, AI టెక్నాలజీ దుర్వినియోగం ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో చూపించే మరో ఉదాహరణగా మారింది.