TDP Telangana : తెలంగాణలో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం.. ఇదే!
TDP Telangana : తెలంగాణ పోల్స్‌లో పోటీ చేయాలా ? వద్దా ? అనే దానిపై టీటీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
- By Pasha Published Date - 07:17 AM, Sun - 29 October 23

TDP Telangana : తెలంగాణ పోల్స్‌లో పోటీ చేయాలా ? వద్దా ? అనే దానిపై టీటీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి తెలంగాణ అసెంబ్లీ పోల్స్‌లో ఆషామాషీగా పోటీచేసే కంటే పూర్తిగా దూరంగా ఉండటమే మంచిదని డిసైడ్ చేసింది. ఓవైపు ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టు, వైసీపీ సర్కారుపై పూర్తిస్థాయి పోరాటం నేపథ్యంలో… మరోవైపు తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేయలేమనే భావనకు టీడీపీ అధినాయకత్వం వచ్చింది. ఈవిషయాన్ని స్వయంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు.. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు విడమరచి చెప్పారని సమాచారం. శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలులో తనతో ములాఖత్ అయిన కాసానికి చంద్రబాబు ఈవిషయాన్ని స్పష్టం చేశారని తెలిసింది. తెలంగాణ ఎన్నికల బరిలో నిలవాలని తాము కోరుకుంటున్నామని, పోటీకి అనుమతించాలని కాసాని కోరగా.. చంద్రబాబు నో చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై ఫోకస్ చేయడం కుదరకపోవచ్చు. పూర్తి శక్తియుక్తులను వాడుకొని మనం ఏపీలో గెలవాలి. ఏపీలో గెలిస్తే తెలంగాణలోనూ పార్టీ తేలిగ్గా బలం పుంజుకుంటుంది. ఆషామాషీగా ఎన్నికల్లో పోటీ చేసి సరైన ఫలితం రాలేదని బాధపడే బదులు దూరంగా ఉండటమే మంచిది. నేను చెప్పిన విషయాలపై మీరు కూడా ఆలోచన చేయండి ’’ అని కాసానికి చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి తెలంగాణ అసెంబ్లీ పోల్స్ బరి నుంచి టీడీపీ తప్పుకున్నట్టే (TDP Telangana) అని తేలిపోయింది.