Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక ‘మాయ’!
మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో? బ్యారేజీ పగుళ్లకు వాళ్లే కారణం కావచ్చునేమో?.బ్యారేజీలో రెండు చోట్ల పగుళ్లు వస్తే ఏదో అయిపోయినట్లు చేస్తున్నారు.ఇలాంటి కట్టడం మరోదేశంలో నిర్మిస్తే కేసీఆర్ ఖ్యాతి ప్రపంచానికి తెలిసేది.
- By Hashtag U Published Date - 06:19 PM, Fri - 13 June 25

Kaleshwaram Project: సామాన్యులను కట్టిపడేసే మాయ అంటే False Dreams + Fake Success + Forced Comparison. False Dreams:”అతి తక్కువ సమయంలో,తక్కువ కష్టంతో,పెద్ద విజయం సాధించవచ్చు” అని నమ్మించడం. (Shortcut Success Syndrome).Fake Success:Looks, Likes, Lifestyle చూపించి నిజ జీవితాన్ని మరిచిపోయేలా చేయడం. Forced Comparison:”ఇతను ఇలా ఉన్నాడు, నేను ఎందుకు ఇలా లేను?” అనే మైండ్‌సెట్ నాటడం.మాయ:నీకు అవసరం లేని దానిని కావాలని అనిపించడం,నీ తృప్తిని నాశనం చేయడం.నిజమైన జీవితం కాకుండా మాయా ప్రపంచంలో బతకించడం!” ఈ కళలో ఆరితేరిన మనుషులు కేసీఆర్,కేటీఆర్,కేసీఆర్.దాదాపు పదేండ్లు వాళ్ళు చేసిందంతా ఇదే.మాయతో సామాన్యుడ్ని బంధించివేయడమే.రైతుబంధు, దళితబంధు,షాదీ ముబారక్, బతుకమ్మ చీరలు, రంజాన్ వేళ నజరానాలు, కేసీఆర్ కిట్స్.. ఇంకా ఇలాంటివి ఎన్నో పథకాలు, తాయిలాలు, సంక్షేమ కార్యక్రమాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ.. వంటి కార్యక్రమాలు, కాళేశ్వరం వంటి అతి భారీ ప్రాజెక్టు (Kaleshwaram Project) ‘మాయ’లో భాగమే!
మనలో ఎవరూ అస్త్రాల ప్రయోగాన్ని చూడలేదు.కానీ గ్రంధాల్లో రాసినవి మనం వింటే ఒక అస్త్రం ప్రయోగించగానే ఒకే సారి వచ్చి అది మీద పడిపోదు అని అర్ధం అవుతుంది.అది విధ్వంసం మొదలు పెట్టటానికి కొంత సమయం తీసుకొంటుంది. ప్రత్యర్ధికి అవతలి వారు ఏ అస్త్రం ప్రయోగించారో తెలుస్తుంది.ఉదాహరణకు ఆగ్నేయాస్త్రం ప్రయోగించగానే అన్నీ ఒక్కసారే కాలి బూడిద అయిపోవు.అది ఒకరకమైన మంటలతో మొదలవుతుంటే అది గమనించిన ప్రత్యర్థి దానికి విరుగుడుగా వారుణాస్త్రం ప్రయోగించి మొదటి దాన్ని నిర్వీర్యం చేస్తాడు.అస్త్ర విద్య నేర్చుకున్నవారికి ఏ అస్త్రానికి ఏది విరుగుడో తప్పకుండ తెలుస్తుంది.కేసీఆర్ 2001 లో టిఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుంచీ ఎదో రకమైన ‘అస్త్రాన్ని’ వాడుతూనే ఉన్నారు.2014 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ‘మాయ’ అనే అస్త్రాన్ని విజయవంతంగా సంధిస్తూ వచ్చారు.
”జనానికి గొప్పగా ఉండేవి అంటే చాలా ఇష్టం.అవి వాళ్ళను ఆశ్చర్యచకితులను చేసేంత అద్భుతంగా,విశ్వరూపంలో కనిపించాలి. మీరు చూపించే అద్భుతాలను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తారు.కళ్ళకు కనిపించేది జనం హృదయాలకు సూటిగా చేరుతుంది.పైపై మెరుగులకే జనం ఎప్పుడూ ముగ్ధులవుతూ ఉంటారు” సుప్రసిద్ధ రాజకీయ తత్వవేత్త నికోలో మాకియవెలి అన్నాడు.మాకియవెలి చెప్పింది చెప్పినట్టుగా ఈ దేశంలో సరిగ్గా ఆచరణలో పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్.
ఎన్ని మోసాలు చేసినా ‘మాయ’ కు గురయిన జనమంతా కేసీఆర్ ను ‘దేవుని’గా పరిగణిస్తున్నారు.ప్రభుత్వ ఖజానాలో లేనందువల్ల సకాలంలో సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి అమలు చేయలేకపోతునున్నారని మనం చెబితే ‘అదంతా మాకు తెల్వది సార్! పెద్దసారు సీఎం అయితే ఆయన ఏదైన చేసి మాకు డబ్బులొచ్చే ఉపాయం చేస్తడు.ఆయన దగ్గర గా తెలివితేటలున్నయి సార్!’అని జనంలో విపరీతమైన నమ్మకం ఉన్నది.ఆ నమ్మకం అంతా కేసీఆర్ పన్నిన ‘మాయ’ అని వాళ్లకు తెలియదు.జనానికి నిజాలు రుచించవు.అవి కటువుగా ఉంటాయి కనుక.అబద్ధాలు,మాయా ప్రపంచంలో బతకడానికే అలవాటు పడిపోయారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎన్ని పుస్తకాలు అయినా రాయవచ్చు.ఎన్ని లక్షల పేజీలయినా రచించవచ్చు.ఏటా ఆదాయం 14,709 కోట్లు.ఖర్చు 28,081 కోట్లు.ఇదీ స్థూలంగా కాళేశ్వరం కథ! ఈ ప్రాజెక్టుతో వినియోగంలోకి వచ్చింది 40,888 ఎకరాలు. 2019 లోనే బరాజ్‌లు దెబ్బతిన్నానాటి కేసీఆర్ ప్రభుత్వం ఖాతరు చేయలేదు.కాళేశ్వరం ఆయకట్టు అంతా ఒక కనికట్టు.18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీళ్లు ఇచ్చే విధంగా డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 2022 మార్చి నాటికి కేవలం 40,888 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లు ఇచ్చినట్టు తేలింది.దీనిని బట్టి కాళేశ్వరంలో లక్ష కోట్ల నిధులు ప్రవహించినా లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని స్పష్టం అవుతుంది. 2016 మే 2వ తేదీన కాళేశ్వరంకు శంకుస్థాపన జరిగింది.2019 జూన్ 21వ తేదీన ప్రారంభించారు.2022 మార్చి నాటికి 14.83 లక్షల ఎకరాలకు సంబంధించిన ‘డిస్ట్రిబ్యూటరీ’ వ్యవస్థ అభివృద్ధికి పనులను చేపట్టాలని నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టింది.కానీ ఇందులో 56 ప్రాజెక్ట్ పనులకు 12 పనులు మాత్రమే పూర్తి చేశారు. నాలుగు లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ అభివృద్ది పనులు అసలు చేపట్టలేదు.మరోవైపు 32 పనుల్లో తొలి ఒప్పందం గడువు ముగిసినా భూసేకరణ పూర్తి కాలేదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక తెల్ల ఏనుగు అని నిర్ధారణ చేయడానికి పెద్దగా పరిశోధనలు చేయనవసరం లేదు.ప్రాజెక్ట్ మొత్తం పూర్తికాకముందే కుంగిపోయి ప్రశార్థకంగా మారింది.ప్రాజెక్ట్‌లో నీళ్లు నిల్వ ఉంచలేని పరిస్థితి ఏర్పడింది.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.83 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు,మరో 4.71 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం.అయితే కొత్త ఆయకట్టు,స్థిరీకరించిన ఆయకట్టులో పండే పంటలకు ఎత్తిపోసే నీళ్లు, తాగునీరు, పరిశ్రమలకు అందించే నీటికి అయ్యే ఖర్చుతోపాటు ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణ వాయిదాల చెల్లింపు కలిపి రూ.28,081.54 కోట్లుగా తేలింది.వాటన్నింటి ద్వారా ఆదాయం మాత్రం రూ.14,709.84 కోట్లు.
ఇందులో ఎత్తిపోతలకు అయ్యే విద్యుత్తు చార్జీలు రూ.10,374.56 కోట్లు.నిర్వహణ ఖర్చులు రూ.272.70 కోట్లు కలిపి రూ.10647.26 కోట్లు అవుతుందని ‘కాగ్’ నివేదిక స్పష్టం చేసింది. లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్‌కు ‘కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్’ ద్వారా తీసుకున్న రుణం రూ.64.204.13 కోట్లు.వడ్డీలు సకాలంలో చెల్లించకుండా వాయిదా వేయడంతో అదనంగా మరో రూ.19,556.4 కోట్ల వడ్డీ అసలుతో కలిపి భారం పడుతోంది.దీంతో అసలు రూ.87,369.89 కోట్లు అయింది.దీనికి వాయిదాలుగా ప్రతి ఏటా వడ్డీ, అసలు కింద రూ.10 వేల కోట్ల నుంచి 14 వేల కోట్ల వరకు చెల్లించవలసి ఉన్నది.దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. . పైగా ఈ ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చడం కోసం, కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడినట్టు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
2019 జూన్ 21న మహారాష్ట్ర, ఏపీ సీఎంలు కూడా హాజరయి అట్టహాసంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ బరాజ్‌లు అదే ఏడాది నవంబర్‌లో వచ్చిన వరదలకు దెబ్బతిన్నాయి.ఆర్‌సీసీ వేసిన కోట్, సీసీ కర్టెన్ గోడలలో కొంత బాగం, దిగువ భాగంలో నిర్మించిన కాంక్రీట్ బ్లాక్‌లు కొట్టుకు పోయాయి.దీనివల్ల మేడిగడ్డ బరాజ్‌కు రూ.83.83 కోట్లు,అన్నారం 65.32 కోట్లు,సుందిళ్ల బరాజ్‌కు రూ.31.24 కోట్లు మొత్తంగా రూ.180.39 కోట్ల నష్టం వాటిల్లింది.డిజైన్ లోపం,లోపభూయిష్టంగా చేపట్టిన పనుల కారణంగానే నష్టం జరిగింది.జరిగిన నష్టానికి తమకు సంబందం లేదని 2019 లోనే కాంట్రాక్టర్లు ప్రకటించారు.తమకు ఇచ్చిన డిజైన్ల ప్రకారమే తాము పనులు చేశామని జరిగిన నష్టానికి తామెలా బాధ్యులమవుతామని ఎదురు ప్రశ్నిస్తున్నారు.నిధులు ఇస్తే పనులు చేయడానికి గుత్తేదార్లు ముందుకు వచ్చారు. దీంతో సాగునీటి శాఖనే ఈ పనులు చేపట్టడానికి రూ. 470.03 కోట్లతో అంచనాలు రూపొందించినా కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు చేపట్టలేదు.
నిర్వహణ లోపం కారణంగానే మేడిగడ్డ కుంగినట్లు కేంద్ర జలశక్తి శాఖ నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ తేల్చి చెప్పింది. 2019-20లలో మేడిగడ్డ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచీ సిమెంట్ కాంక్రీట్ బ్లాక్‌లను,లాంచింగ్ అప్రాస్‌లను తనిఖీ చేయలేదని, నిర్వహించలేదని కమిటీ గుర్తించింది.నిర్వహణ లోపం కారణంగానే బరాజ్ కుంగిందని కమిటీ అభిప్రాయ పడింది.బరాజ్‌ను పునరుద్ధరించే వరకు ఇది నిరుపయోగంగానే ఉంటుంది.అన్నారం,సుందిళ్ల బరాజ్‌ల పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంటుందన్న అభిప్రాయాన్ని కేంద్ర జలశక్తి కమిటీ వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని దేశమంతా ప్రచారం జరిగింది.‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది.వేల కోట్ల అవినీతి జరిగింది’’అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ,అమిత్ షా, జేపీ నడ్డా అనేక సార్లు ఆరోపణలు చేశారు.కానీ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయిన ప్రస్తుత బీజేపీ ఎంపీ,కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసినా ఈటల రాజేందర్ అందుకు భిన్నంగా ఇచ్చిన వివరణతో బీజేపీ షాక్ కు గురయింది. ఈటల రాజేందర్, కేసీఆర్ తో కుమ్కక్కయ్యారు. కాళేశ్వరంలో ఈటలకు కూడా వాటాలు ముట్టినందునే కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడారు. అంతా కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందంటున్నారు. టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రాజెక్టు కట్టారని ఈటల చెప్పారు.ప్రజలు, రైతుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే ప్రాజెక్టు అంచనాలను పెంచారని చెప్పారు.బీఆర్ఎస్ తో బీజేపీకి ఉన్న లోపాయికారీ ఒప్పందం మేరకే కేసీఆర్ ను కాపాడేందుకు ఈటలతో వివరణ ఇప్పించారా? బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలి.లేకుంటే ప్రధాని మోదీసహా బీజేపీ పెద్దలకు కూడా వాటాలు ముట్టినట్లే.బీజేపీ,బీఆర్ఎస్ ఒక్కటేననే నిజమేనని ప్రజలంతా భావించాల్సి వస్తుంది”.అంటూ బీజేపీ వ్యతిరేకులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల విచారణకు హాజరు కావడానికి,మూడు రోజుల ముందే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక బాంబు పేల్చారు.”ఈటల,బిఆర్ఎస్ నాయకుడు హరీష్ రహస్యంగా సమావేశమైనట్టు నా దగ్గర పక్కా సమాచారం ఉంది”అని పిసిసి అధ్యక్షుడు అన్నారు.మహేష్ గౌడ్ కు అందిన సమాచారం నిజమే అయితే ఈటల వివరణపై బిఆర్ఎస్ ప్రభావం ఉన్నట్టు భావించవచ్చు.”కాళేశ్వరం ప్రాజెక్ట్ ముందుగా 82 వేల కోట్ల అంచనా వేశారు తరువాత ఎంత పెరిగిందో నాకు తెలియదు.డీపీఆర్ కోసం వ్యాప్కోస్ సంస్థకు 595 కోట్లు విడుదల చేసినట్లు నాకు తెలియదు”.అని కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి,ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.
”మహారాష్ట్ర అభ్యంతరాలు,సీడబ్ల్యూసీ సూచనల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి వచ్చింది.సీడబ్ల్యూసీ అనుబంధ సంస్థ అయిన వ్యాప్కోస్‌ను ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని కోరాం.సమస్యలన్నింటికీ పరిష్కారంగా నీటిలభ్యతకు పూర్తిగా భరోసా ఉన్న మేడిగడ్డ కనిపించింది. మేడిగడ్డ,అన్నారం,సుందిళ్ల బ్యారేజీలను నిర్మించాలని వ్యాప్కోస్ సిఫార్సు చేసింది.2016 జులై 17న వ్యాపోస్ సంస్థ లైడార్ సర్వే చేసింది.2017 సెప్టెంబర్ 17న సీడబ్ల్యూసీ రాసిన లేఖలో మేడిగడ్డ వద్ద 283 టీఎంసీల నీళ్లున్నాయని చెప్పింది.అన్ని రిపోర్టులపై చర్చించి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాలని నిర్ణయించాం.మేడిగడ్డ బరాజ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసే బాధ్యతను వ్యాప్కోస్‌కే అప్పగించినం.బరాజ్‌ల స్థలాలను వ్యాప్కోస్ ఎంపిక చేసింది.
గతంలో ప్రాణహిత- చేవెళ్ల డీపీఆర్‌ను వ్యాప్కోసే రూపొందించింది.వ్యాపోస్ సంస్థ నివేదికల ఆధారంగా మేడిగడ్డ,అన్నారం,సుందిళ్ల బరాజ్‌లు నిర్మించినం. 2016, జనవరి 17న వ్యాపోస్ డీపీఆర్ సమర్పించింది. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నం.వ్యాపోస్ నుంచి లెటర్ వచ్చాకే బరాజ్‌ల లొకేషన్లను మార్చా రు.హైపవర్ కమిటీలో ‘వ్యాప్కోస్’ అధికారి కూడా సభ్యులుగా ఉన్నారు.హైపవర్ కమిటీ,వ్యాపోస్ కలిసి బరాజ్‌ల లొకేషన్ల మార్పునకు ఆమోదం తెలిపాయి.కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 30 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు,10 టీఎంసీలు ఎన్ రూట్ గ్రామాల మిషన్ భగీరథ తాగునీటి అవసరాలకు,16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు.. ఇలా వివిధ వర్గాలకు విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో రుణాల చెల్లించాలని అనుకున్నాం.కరోనా వల్ల 2 ఏండ్లు ఆలస్యమైంది.3 బరాజ్‌లు, ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలో కలిపి 141 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు.అత్యధికంగా మల్లన్నసాగర్‌లో 50 టీఎంసీలను నిల్వ చేసుకోవచ్చు”.అని మాజీ సీఎం కేసీఆర్,మాజీమంత్రి హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట వివరించారు.
కేసీఆర్,ఈటల,హరీశ్ రావుల వివరణలో ఒక సంస్థ పేరు పదే పదే ప్రస్తావనకు వచ్చింది.ఆ సంస్థ పేరు వ్యాప్కోస్.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా వ్యాప్కోస్ రాష్ట్రాల్లో జలవనరులకు సంబంధించిన ప్రాజెక్టులు,రిజర్వాయర్లు,బరాజ్ ల నిర్మాణాలకు గాను ప్రణాళిక,డిజైన్లు,నిర్మాణ వ్యవహారాలు ఇతర అంశాలపై సర్వేలు జరిపి,డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి సంబంధిత ప్రభుత్వాలకు అందిస్తుంది.’వ్యాప్కోస్’సూచనలు,నివేదికల ఆధారంగానే కాళేశ్వరంను నిర్మించినట్టు బిఆర్ఎస్ బలంగా వాదిస్తోంది.కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినంత మాత్రాన ‘అత్యంత విశ్వసనీయత’గలిగినది అని ఎవరయినా సర్టిఫికెట్ ఇస్తే అంతకన్నా అవివేకమూ,అమాయకత్వము మరొకటి లేదు.
‘వ్యాప్కోస్’మాజీ చైర్మన్,ఎండీ రాజెందర్ గుప్తా,ఆయన కుమారుడు గౌరవ్ లను 2023 మేలో అరెస్టు చేశారు.రాజేందర్ గుప్తా ఇంట్లో 38 కోట్ల నగదును సీబీఐ స్వాధీనం చేసుకున్నది.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాజేందర్ గుప్తాను జైలుకు పంపించారు.ఆయన వ్యాప్కోస్ లో 1989 లో చేరారు.అంచెలంచెలుగా ఎదిగి 2010 ఏప్రిల్ లో చైర్మన్,ఎండీ అయ్యారు.ఐదేండ్ల తర్వాత ఆయన పదవీకాలం 2018 సెప్టెంబర్ వరకు పొడిగించారు.మళ్ళీ 2020 వరకు రెండేండ్ల కాలానికి పదవిని పొడిగించారు.కాళేశ్వరం ప్రాజెక్టును 2016 నుంచి 2019 వరకు మూడేండ్లలో నిర్మించారు.ఇదొక రికార్డుగా కేసీఆర్,ఆయన పార్టీ నాయకులంతా చెబుతుంటారు.ఇంత వేగంగా,ఇలాంటి భారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినందువల్ల కూడా,నాణ్యతాపరమైన సమస్యలు తలెత్తినట్టు నిపుణుల విశ్లేషణ.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ముడిపడి ఉన్న వారిలో వ్యాప్కోస్ మాజీ చైర్మన్ రాజిందర్ కుమార్ గుప్తా,ఇరిగేషన్ మాజీ ఈ.ఎన్.సి,హరిరామ్,మాజీ ఈ.ఈ.. నూనె శ్రీధర్ అరెస్టయ్యారు.ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై ఈ ముగ్గురి అరెస్టులు జరిగాయి.ఇంకా ఎంతమంది అరెస్టు కానున్నారో ఇంకా తెలియదు.
”మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో? బ్యారేజీ పగుళ్లకు వాళ్లే కారణం కావచ్చునేమో?.బ్యారేజీలో రెండు చోట్ల పగుళ్లు వస్తే ఏదో అయిపోయినట్లు చేస్తున్నారు.ఇలాంటి కట్టడం మరోదేశంలో నిర్మిస్తే కేసీఆర్ ఖ్యాతి ప్రపంచానికి తెలిసేది.ఆయన కీర్తి అజరామరంగా ఉండేది.కేసీఆర్ కు ఎన్నో అవార్డులు,రివార్డులు వచ్చేవి.రేవంత్ రెడ్డి చిల్లరగాడు.ఆయన కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు” అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూన్ 11 న నిప్పులు చెరిగారు.సీఎంపై అన్ పార్లమెంటరీ భాషలో దుమ్మెత్తిపోశారు.
”రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాణం చేసే డిసెంబర్ 23 వరకు,60 రోజులకు పైగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం,బాంబులు ఎవరు పెట్టారో పోలీసులతో విచారణ చేసి ఎందుకు తేల్చలేదు? మీ బుకాయింపునకు సమాజం విస్తుపోతోంది.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను ఎల్ అండ్ టి తిరస్కరించడాన్ని కేటీఆర్ స్వాగతించడం ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు.నిర్మించిన నాలుగేండ్లకే మేడిగడ్డ భూమిలో ఐదు అడుగులు ఎందుకు కుంగింది? నిట్ట నిలువునా పునాది నుండి పైవరకు ఎందుకు చీలిపోయింది? మూడు బ్యారేజీలలో భూ అంతర్గత,భూ సాంకేతిక పరీక్షలు,ఇంకా అనేక పరీక్షలు ప్రముఖ వైజ్ఞానిక సంస్థలతో అన్నారం,సుందిళ్లలో కూడా చేయించాలని ఎన్ డీ ఎస్ ఏ ఎందుకు సిఫారసు చేస్తున్నది? మూడు బ్యారేజీలలోనూ మేడిగడ్డ లాంటి అత్యంత ప్రమాదకర పరిస్థితిలే ఉన్నాయనేది వాస్తవం కాదా? ఎన్డిఎస్ఏ పేర్కొన్నట్లు ఆ నాలుగు సంవత్సరాలలో మేడిగడ్డ బ్యారేజ్ గుండా ప్రవహించిన భారీ వరద నీరు మేడిగడ్డ కుప్పకూలడానికి ప్రధాన కారణం.ఇందులో 90 శాతం నీరు ప్రాణహితదే.కెసిఆర్ ఒత్తిడిలో ఇంజనీర్లు సృష్టించిన వైకల్య విపత్తు ఇది.తక్కువ ఖర్చుతో పూర్తయ్యే తుమ్మిడిహెట్టి రాక్ బెడ్ ను వదిలి,మూడు బ్యారేజీలను బలహీన ఇసుక బెడ్ దగ్గర రీ ఇంజనీరింగ్,రీ డిజైనింగ్ చేయడమే ఈ విపత్తుకు కారణం”అని సామాజిక కార్యకర్త నయనాల గోవర్ధన్ అంటున్నారు.