TGSRTC : టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ఆర్టీసీ వివరణ..
. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఈ సంక్రాంతికి కేవలం 5 రోజులు పాటు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సవరించింది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతోంది.
- By Latha Suma Published Date - 02:02 PM, Sat - 11 January 25

TGSRTC : సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తిస్థాయిలో సన్నద్దమైంది. అతి పెద్ద పండుగకు 6,432 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఆ రోజుల్లో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 19, 20 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి కూడా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. అయితే తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా బస్సు టికెట్ ధరలు భారీగా పెంచారని ప్రచారం జరుగుతోంది.
దీనిపై టీజీ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక బస్సుల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు. ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించినట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరోసారి స్పష్టం చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తుంది. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ.. రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది.
ఈ క్రమంలోనే స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించినట్లు 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఈ సంక్రాంతికి కేవలం 5 రోజులు పాటు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సవరించింది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతోంది. ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచిస్తోంది.
Read Also: Live In Partner Murder : లివిన్ పార్ట్‌నర్ దారుణ హత్య.. 8 నెలలు ఫ్రిజ్‌లోనే డెడ్‌బాడీ