Electric-Vehicles : తెలంగాణ సర్కార్ ‘నో ట్యాక్స్’ విధానంతో జోరందుకున్న ‘ఈవీవాహనాలు’
Electric Vehicles : రోడ్డు పన్ను రద్దుతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- Author : Sudheer
Date : 12-12-2024 - 2:47 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric Vehicles) రోడ్డు పన్ను (Road Tax) పూర్తిగా రద్దు చేయాలని ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. రోడ్డు పన్ను రద్దుతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మాఫీ విధానం రెండు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, టాక్సీలు, ఆటో రిక్షాలు, లైట్ గూడ్స్ కేరియర్స్, ట్రాక్టర్లు, బస్సుల తదితర అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై వర్తిస్తుంది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రకటించారు. ఈ విధానం 2026 డిసెంబరు 31 వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో గాలితో కూడిన కాలుష్యాన్ని నివారించడానికి ఎలక్ట్రిక్ వాహనాల ఆవాహనాన్ని పెంచే లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో ప్రతి 100 వాహనాలలో 5 వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు తయారీదారులు ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానాన్ని అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నాలుగు ఇతర రాష్ట్రాలను సందర్శించి వారి విధానాలను పరిశీలించారు. ఆ రాష్ట్రాల నుండి మంచి విధానాలను తీసుకొని, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసారు. ఈ విధానం ఢిల్లీ వంటి నగరాల్లో ఎదుర్కొనే కాలుష్య సమస్యలను నివారించడానికి అవసరమని ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటికే 2020-2030 మధ్యకాలం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని ప్రకటించింది. కానీ, ఆ విధానం పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు. ప్రస్తుతం, ప్రభుత్వం ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సంకల్పించింది. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఈవీ పాలసీ వాహనదారుల్ని ఆకర్షిస్తుండడంతో కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ల కొనుగోలు క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నెల 3 వరకు సుమారు 16 రోజుల్లోనే 3 వేల 372 ఎలక్ట్రిక్ వాహనాలు రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా రవాణాశాఖ విజయాల్లో భాగంగా ఈవీ రిజిస్ట్రేషన్ల వివరాల్ని రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 78 వేల 262 కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరిగాయని రవాణాశాఖ తెలిపింది. అంతకముందు ఏడాదిలో 51,934 ఈవీల రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంతో పోలీస్తే తమ ఏడాది పాలనలో ఈవీల రిజిస్ట్రేషన్లు 52.28 శాతం పెరిగాయని తెలిపింది.