Telangana Budget 2022-23: గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించవచ్చా? ఆ రూల్ ఏం చెబుతోంది?
- Author : HashtagU Desk
Date : 01-03-2022 - 9:42 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ సారి వివాదంతోనే ప్రారంభం అయ్యేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి- గవర్నర్‌ల మధ్య ముదురుతున్న వివాదాలకు వేదికగా మారనుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. trs-bjpల మధ్య ఘర్షణకు ఉదాహరణగా నిలవనున్నాయి.గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీ గా వస్తోంది. అయితే దాన్ని ఈ సారి పాటించే సూచనలు కనిపించడం లేదు. అలా చేయవచ్చా అన్నది చర్చనీయాంశంగా మారింది. రూల్స్‌లోని టెక్నికాలిటీస్ ఆధారంగా చేయవచ్చని కొందరు అంటున్నారు.
సాధారణంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన తరువాత సభను సైన్ డై చేస్తారు. అంటే దీనర్థం సభను నిరవధికంగా వాయిదా వేసినట్టు లెక్క. అనంతరం సుదీర్ఘ కాలం పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రొరోగ్ చేస్తారు.సభను సైన్ డై చేస్తే తిరిగి సమావేశాలకు పిలిచే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. అదే ప్రొరోగ్ చేస్తే మళ్లీ కాల్‌ఫర్ చేసే పవర్ గవర్నర్ చేతిలో ఉంటుంది. మంత్రివర్గం సిఫార్సుల మేరకే గవర్నర్ ఈ అధికారాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం గవర్నర్ సంతకాలు చేయకుండా నిరాకరించవచ్చు.
ఈ బ్యాక్ గ్రౌండ్‌లో ఈ నెల 7న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత శీతాకాల సమావేశాలను సైన్‌డై చేశారే తప్ప, ప్రొరోగ్ చేయలేదని అందువల్ల గవర్నర్ పర్మిషన్ అవసరం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.అందువల్ల ఈ ఏడాదికి సమావేశాలను కొత్తగా ప్రారంభించే అవసరం లేదని, ఆ కారణంగా గవర్నర్ ప్రసంగం చేయాల్సిన పరిస్థితి లేదని అంటున్నాయి. గతంలో ఇలా జరిగాయని కూడా గుర్తు చేస్తున్నాయి.మరి అసెంబ్లీలో పెట్టే బడ్జెట్ పత్రాలపై మొదట గవర్నర్ సంతకం చేయాల్సి ఉంటుంది. దానిపై ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.