LRSపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్‌డేట్
LRS : ఈ పథకం కింద నిషేధిత జాబితాలో లేని, హైడ్రా నిబంధనలకు అనుగుణమైన సర్వే నెంబర్లలోని ప్లాట్లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాలను జారీ చేయడం ప్రారంభమైంది
- Author : Sudheer
Date : 04-03-2025 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అనుమతి లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్ (Land Regularisation Scheme) ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. ఈ పథకం కింద నిషేధిత జాబితాలో లేని, హైడ్రా నిబంధనలకు అనుగుణమైన సర్వే నెంబర్లలోని ప్లాట్లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాలను జారీ చేయడం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25.70 లక్షల ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గత నాలుగేళ్లుగా ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ ప్రక్రియ భారీ ఊరట కలిగిస్తోంది. అయితే చెరువులకు 200 మీటర్లలోపు ఉన్న ప్లాట్లకు ఈ పథకం వర్తించదు.
Powerful Sister: అమెరికా కాచుకో.. ఎంతకైనా తెగిస్తాం.. కిమ్ సోదరి వార్నింగ్
2020 ఆగస్టు 26 నాటికి ఒక లేఅవుట్‌లో 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే, మిగిలిన ప్లాట్లను కూడా క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించే వారికి 25% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్ రిజెక్ట్ అయిన సందర్భంలో, 10% ప్రాసెసింగ్ చార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఇది లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చిన ఊరటగా భావించవచ్చు.
పర్మిషన్ లేని లేఅవుట్లలో ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవడానికి మునిసిపల్ శాఖ సూచనలు విడుదల చేసింది. సోమవారం నుంచి ఈ ప్లాట్లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాలు జారీ చేయడం ప్రారంభమైంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అక్రమ లేఅవుట్ల జాబితాను రూపొందించి, వాటిని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అనుసంధానం చేశారు. అర్హత కలిగిన వారు మార్చి 31వ తేదీలోగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Powerful Sister: అమెరికా కాచుకో.. ఎంతకైనా తెగిస్తాం.. కిమ్ సోదరి వార్నింగ్
ఎల్‌ఆర్‌ఎస్‌తో సంబంధమైన వివరాలను తెలుసుకోవాలనుకునే దరఖాస్తుదారులు 1800 599 8838 కాల్ సెంటర్ నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారి సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు. నిషేధిత జాబితాలో లేని, చెరువులు, కాలువలకు 200 మీటర్ల పరిధిలోకి రాని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. మార్చి 31వ తేదీలోగా ఫీజులు చెల్లించే వారికి 25% రాయితీ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.