Engineering Colleges : 40 ఇంజినీరింగ్ కాలేజీలకు ‘అటానమస్’.. తెలంగాణ సర్కారు విచారణ ?
ఇంజినీరింగ్ కాలేజీలకు ఇంత ఈజీగా ‘అటానమస్’(Engineering Colleges) హోదా మంజూరు కావడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది.
- By Pasha Published Date - 10:35 AM, Thu - 21 November 24

Engineering Colleges : ‘అటానమస్’ హోదాను ఇంజినీరింగ్ కాలేజీ పొందడం అంటే గతంలో చాలా పెద్ద విషయం. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆ హోదాను పొందడం ఈజీ అయిపోయింది. తెలంగాణలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నొలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) పరిధిలో మొత్తం 137 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అయితే వాటిలో 85కిపైగా కాలేజీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ‘అటానమస్’ హోదా మంజూరైంది. ఈ హోదాను పొందిన 85కిపైగా తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీలకుగానూ 40 కాలేజీలకు గత మూడేళ్లలో అటానమస్ హోదా మంజూరైంది.
Also Read :Arrest Warrants On Adani : గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై అమెరికాలో కేసు.. అరెస్టు వారెంట్ జారీ ?
స్వయంగా విద్యార్థులు నాసిరకం కాలేజీలుగా చెప్పుకొనే వాటికి కూడా అటానమస్ మంజూరు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో యూజీసీకి చెందిన నిపుణులు, విద్యావేత్తలు పరిశీలించలేదా ? పరిశీలించకుండానే ‘అటానమస్’ హోదాను ఇంజినీరింగ్ కాలేజీలకు మంజూరు చేశారా ? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అందుకే దీనిపై దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో తగినన్ని వసతులు లేకున్నా వాటిలో సీట్లను పెంచినట్లు తెలంగాణ సర్కారు గుర్తించింది. దీనిపై ప్రత్యేక విచారణ కమిటీని నియమించాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. నాసిరకం కాలేజీలకు అటానమస్ హోదా ఇస్తే ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత తగ్గిపోతుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి(2025-26) సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అలర్ట్ అయిన రాష్ట్ర సర్కారు.. తమ ఆమోదం లేకుండా ఇంజినీరింగ్ కాలేజీలకు ఎన్‌వోసీలు ఇవ్వకూడదని ఏఐసీటీఈకి సూచించింది.
Also Read : High Court Bench : రాయలసీమకు గుడ్ న్యూస్.. కర్నూలులో హైకోర్టు బెంచ్ !
‘అటానమస్’ హోదా ఈజీగా ఎందుకు ఇస్తున్నారంటే..
ఇంజినీరింగ్ కాలేజీలకు ఇంత ఈజీగా ‘అటానమస్’(Engineering Colleges) హోదా మంజూరు కావడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది. అదేమిటంటే.. ఇంతకుముందు కేవలం ‘న్యాక్ ఏ’ గ్రేడ్, ఆ పై గ్రేడులు కలిగిన కాలేజీలకే ‘అటానమస్’ హోదాను కేటాయించేవారు. కానీ ఇప్పుడు దాన్ని ‘న్యాక్ బీ’ గ్రేడ్‌కు యూజీసీ కుదించింది. ఎన్‌బీఏ గుర్తింపునకు సంబంధించిన రూల్స్‌ను సైతం కేంద్ర సర్కారు సరళతరం చేసింది. అందువల్ల ఈజీగా ఇంజినీరింగ్ కాలేజీలకు ‘అటానమస్’ హోదా మంజూరవుతోంది.