Telangana Formation Day : ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద కొంతమంది చేతుల్లోకి వెళ్లింది – రేవంత్
తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ పై దాడి జరిగిందని , సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందని.. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరిందని ఆరోపించారు
- Author : Sudheer
Date : 02-06-2024 - 12:23 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana Formation Day) సందర్బంగా పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ..తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నానని తెలిపారు. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ లకు తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ… అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ పై దాడి జరిగిందని , సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందని.. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరిందని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదని అన్నారు. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ… అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదన్నారు. “ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం… ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం” అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుండి… ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రగతి భవన్ ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా పేరు మార్చి… ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అక్కడ ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
ప్రజల సమస్య నేరుగా విని, పరిష్కరిస్తున్నాం. సచివాలయంలోకి ఈ రోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరాపార్కులో ధర్నాచౌక్ కు అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛను ఇచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం అని సీఎం చెప్పుకొచ్చారు. ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి ఆహ్వానించడం కోసం బిడ్డకు అనుమతి కావాలా? ఏ హోదాలో ఏ పదవిలో ఉన్నారని మహాత్మాగాంధీని జాతి పితగా గుర్తుంచుకున్నాం? తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు ఈ సమాజం సోనియాను గుర్తుంచుకుంటుంది. తెలంగాణతో సోనియా గాంధీది పేగు బంధం. రాజకీయ బంధం కాదు.
తెలంగాణ వచ్చి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదు. అందుకే జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఉంచాలని నిర్ణయించాం. అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించి ఆ గీతాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నాం అన్నారు.
Read Also : MLC Election : నవీన్‌కుమార్ రెడ్డి అభినందించిన హరీశ్ రావు